వీడియో: పుతిన్‌ ప్లేసులో మరొకరు.. తెరపైకి బాడీ డబుల్‌ థియరీ!

9 Aug, 2022 19:41 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విషయంలో పాశ్చాత్య మీడియా వీలైనంత వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ పోతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం వంకతో వీలైనంత రీతిలో పుతిన్‌ను బద్నాం చేస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఎక్కువ కాలం బతకడంటూ వీడియో కథనాలతో ఊదరగొడుతోంది. ఇప్పుడు ఏకంగా మరో థియరీని తెరపైకి తెచ్చింది. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యం బాగోలేదని చాలాకాలం నుంచి వెస్ట్రన్‌ మీడియా వరుస కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో 69 ఏళ్ల పుతిన్‌ తనకు బాడీ డబుల్‌ను తెరపైకి తెచ్చాడంటూ ఉక్రెయిన్‌  కొత్త వాదన తెరపైకి తెచ్చింది. 

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్‌.. నిత్యం మెడికల్‌ చెకప్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే అధికారిక కార్యక్రమాలకు ఆయన తన బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నాడని ఉక్రెయిన్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైర్య్‌లో బుడానోవ్‌ చెప్తున్నాడు. 

పుతిన్‌ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తే..  చాలా భేటీల్లో ఆయన హైట్‌, వెయిట్‌, చెవుల భాగంలో తేడాలను పరిశీలించవచ్చని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మనిషి చేతి వేళ్లు యూనిక్‌గా ఉన్నట్లే.. చెవి భాగం సైతం యూనిక్‌గా ఉంటుంది. అలాంటిది పుతిన్‌లో ఆ భాగంలో తేడాను సులువుగా గమనించవచ్చు. బహుశా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్‌.. ప్రజలకు కనిపించేందుకు వీలుగా తన బాడీ డబుల్స్‌ను ఉపయోగించుకుంటున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశాడు ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌.

అంతేకాదు ఇరాన్‌ పర్యటనకు సైతం పుతిన్‌ తన బాడీ డబుల్‌నే పంపించాడని, పైగా ఆ పర్యటనలో పుతిన్‌ బాగా జోష్‌లో కనిపించిన విషయం ఆ అనుమానాల్ని మరింత బలపరుస్తోందని చెప్పాడాయన. మరోవైపు ఈ వాదనపై క్రెమ్లిన్‌ గప్‌చుప్‌గా ఉండిపోయింది.

పుతిన్‌ బాడీ డబుల్‌ థియరీ ఇలా తెర మీదకు రావడం ఇదే కొత్త కాదు. 2018లో పుతిన్‌ లాగ ముగ్గురు ఉన్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆసక్తికర కథనం ప్రచురించింది.  ఆ సమయంలో ట్విటర్‌లోనూ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మూడు భిన్నమైన రూపాలున్న పుతిన్‌ ఫొటోలు వైరల్‌ అయ్యాయి కూడా. 

బాడీ డబుల్‌ అంటే.. ఒక వ్యక్తి బదులుగా అలాంటి కవళికలు ఉన్న వ్యక్తి ఆ పనిని పూర్తి చేయడం. చరిత్రలో బ్రిటిష్‌ ఆర్మీ ఆఫీసర్‌, ఫీల్డ్‌ మార్షల్‌ బెర్నార్డ్‌ లా మోంట్గోమెరీ, సద్దాం హుస్సేన్‌, జోసెఫ్‌ స్టాలిన్‌లు బాడీ డబుల్‌ను ఉపయోగించేవాళ్లన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.

ఇదీ చదవండి:: గొప్పలకు పోతున్న రష్యా!... కౌంటర్‌ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్‌

మరిన్ని వార్తలు