రష్యన్‌ బలగాలు వెనక్కి.. దానర్థం కాల్పుల విరమణ కాదు: రష్యా ట్విస్ట్‌

30 Mar, 2022 08:35 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి 30 రోజులకు పైగా దాటింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యన్‌ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం టర్కీలో జరిగిన శాంతి చర్చల ద్వారా ఇరుదేశాలు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకుంటే ఇప్పటికే పలు మార్లు శాంతి కోసం చర్చలు జరిగినా, సూమారు నెలరోజుల తర్వాత ఇరుదేశాల చర్చల్లో పురోగతి లభించినట్లు తెలుస్తోంది.

ఈ చర్చల్లో పురోగతి.. కీవ్, చెర్నిహివ్ నుంచి తమ బలగాలు ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. కీవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి పిలిపిస్తామని శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా ప్రతినిధి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సమస్యకు పూర్తిగా పరిష్యారం దొరికే వరకు కాల్పుల విరమణ ఉండబోదని అందుకోసం మరింత చర్చించాలని ఆయన తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కోసం తాము మరింత దూరం ప్రయాణించాలని ఆయన చెప్పారు. దీంతో రష్యా బలగాల దాడులు ఉక్రెయిన్‌లో కొనసాగుతూ ఉన్నాయి.

 చర్చలు జరుపుతున్న సమయంలోనూ కొనసాగిన దాడులు 
ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతుండగా పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్లో పలు ప్రాంతాలపై రష్యా తమ దాడులను కొనసాగిస్తూనే ఉంది. మంగళవారం ఓ వైపు చర్చలు జరుగుతున్నప్పటికీ పశ్చిమ ప్రాంతంలోని ఓ ఇంధనాగారంపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి.  దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవ్‌లో 9 అంతస్తుల పాలనా భవనంపై రష్యన్‌ బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డారు. 

మరిన్ని వార్తలు