రష్యాపై అమెరికా ఆంక్షలు.. బైడెన్‌కు సలహాలిచ్చిన దలీప్‌ సింగ్‌, కీ రోల్‌ మనోడిదే

23 Feb, 2022 14:54 IST|Sakshi

ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రష్యా, పుతిన్‌ స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన తూర్పు ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షల విధింపులో బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తరపున కీలకంగా వ్యవహరించింది భారత సంతతికి చెందిన వ్యక్తే కావడం విశేషం. ఆయనే ఆర్థిక సలహాదారు దలీప్‌ సింగ్‌.

ఇండో-అమెరికన్‌ అయిన దలీప్‌ సింగ్‌.. నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా, ఇంటర్నేషనల్‌ ఎకనమిక్స్‌ విభాగానికి డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నారు. గత కొన్నిరోజులు ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో వైట్‌ హౌజ్‌ ప్రెస్‌ రూమ్‌లో దలీప్‌ రెండుసార్లు కనిపించారు. రష్యాపై ఆర్థిక ఆంక్షల వ్యవహారంలో బైడెన్‌కు ప్రతీది దగ్గరుండి క్షుణ్ణంగా వివరించడంతో పాటు, ఏ మేర అమలు చేయాలనే విషయాలపై కీలక సూచనలు ఇచ్చింది ఈయనే. అంతేకాదు ఆ అమలును బైడెన్‌ తర్వాత ప్రపంచానికి ప్రకటించింది దలీప్‌ సింగ్‌ కావడం విశేషం.  

దలీప్‌ ఏం చెప్పాడంటే..
‘‘ఉక్రెయిన్‌పై రష్యా దీర్ఘకాలంగా సమీక్ష తర్వాత దండయాత్ర మొదలుపెట్టింది. దానికి మా స్పందనే ఇది. ఇవాళ అధ్యక్షుడు (జో బైడెన్‌) మిత్రదేశాలు.. భాగస్వాములతో చర్చించి త్వరగతిన ప్రతిస్పందించారు. ఈ చర్యలు చరిత్రలో నిలిచిపోయేవి. ఒక నిర్ణయాత్మక ప్రతిస్పందన కోసం వారాల నుంచి నెలలు పట్టింది.. అంటూ మొదలుపెట్టి సుదీర్ఘంగా ప్రసంగించారు దలీప్‌ సింగ్‌. 

జర్మనీతో రాత్రికి రాత్రే సంప్రదింపులు జరిపి.. పైప్‌లైన్‌ల ఆపరేషన్లను నిలిపివేయించాం. ఆపై ఆర్థిక ఆంక్షలు విధించాం. బిలియన్ల డాలర్లు విలువ చేసే ఆస్తుల్ని, ఆర్థిక లావాదేవీలను ఆపేశాం. తద్వారా అమెరికా, యూరప్‌ దేశాలతో ఎలాంటి లావాదేవీలు ఉండబోవు. పైగా కొత్త అప్పులు పుట్టవు. రష్యా ఉన్నత కుటుంబాలు, ధనికులపై అదనపు చర్యలూ ఉంటాయి.  ఇవేం పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కావు. పరస్సర సహకారంతోనే ముందుకెళ్లాం. ఈరోజు మేము తీసుకున్న చర్యలు మొదటి విడత మాత్రమే. మేము ఇంకా వెల్లడించనివి చాలానే ఉన్నాయి. పుతిన్ గనుక మొండిగా ముందుకెళ్తే..  ఆర్థిక ఆంక్షల్ని, ఎగుమతి నియంత్రణలను ఉపయోగించి ఒత్తిడి పెంచుతాము. మిత్రదేశాల సహకారంతో పూర్తిస్థాయిలో ఆంక్షల్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని దలీప్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

రష్యా పాలనా విధానంలో సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నందునే..  తాను కీలక బాధ్యతలు చేపట్టాల్సిన వచ్చిందంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీకి చెప్పడం.. రష్యా ఆంక్షల వ్యవహారంలో దలీప్‌ సింగ్‌ ప్రాధాన్యం ఏపాటిదో చెప్పనకనే చెప్తుంది. 

దలీప్‌ సింగ్‌ నేపథ్యం.. 
దలీప్‌ సింగ్‌ పుట్టింది మేరీల్యాండ్‌ ఓల్నీ, పెరిగింది నార్త్‌ కరోలినా రాలేయిగ్‌లో. కాంగ్రెస్‌(అమెరికా చట్ట సభ)కు ఎంపికైన తొలి ఏషియన్‌ అమెరికన్‌ దలీప్‌ సింగ్‌ సౌంధుకి బంధువు ఈ దలీప్‌ సింగ్‌. ఆర్థిక శాస్త్రంలో డీగ్రీ చేసిన దలీప్‌, పలు ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యల్ని అభ్యసించాడు. గతంలో ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌కి వైస్‌ ప్రెసిడెంట్‌గా, ఒబామా హయాంలోనూ పలు కీలక బాధ్యతలు నిర్వహిచాడు. ప్రస్తుతం బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నారు 47 ఏళ్ల దలీప్‌ సింగ్‌.

మరిన్ని వార్తలు