'భారత్‌కు ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేస్తాం'

22 Dec, 2020 11:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌తో ఎస్‌–400 క్షిపణి వ్యవస్థల సరఫరా సహా అన్ని రక్షణ ఒప్పందాల అమలు కొనసాగుతుందని రష్యా స్పష్టం చేసింది. అమెరికా విధించే ఏకపక్ష ఆంక్షలను పట్టించుకోమని తెలిపింది. రష్యా రాయబారి నికొలాయ్‌ కుదాషెవ్, రష్యా డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ రొమన్‌ బబూష్కిన్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘రష్యా నుంచి అత్యాధునిక ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసినందుకు గాను టర్కీపై అమెరికా ఆంక్షలను విధించింది. దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేందుకు అమెరికా ఇలా ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించడం అన్యాయం. ఐక్యరాజ్య సమితి విధించే ఆంక్షలను తప్ప ఇలా ఏకపక్షంగా ప్రకటించే చర్యలను పట్టించుకోం. ఏది ఏమైనా భారత్‌కు ఎస్‌–400 క్షిపణి వ్యవస్థల సరఫరా కొనసాగుతుంది’ అని అన్నారు. ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలు ఐదింటిని కొనుగోలు చేసేందుకు 2018లో భారత్‌ రష్యాతో 5 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయకుండా మొదటి దఫాగా 800 మిలియన్‌ డాలర్లను చెల్లించింది. 

మరిన్ని వార్తలు