డేంజర్‌ బెల్స్‌.. ప్రపంచానికి వార్నింగ్‌ ఇచ్చిన పుతిన్‌!

29 May, 2022 08:10 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ పుతిన్‌ మరో హెచ్చరికను జారీ చేశారు. ఉక్రెయిన్‌ ఆక్రమణను మరింత వేగవంతం చేసేందుకు అత్యంత శక్తివంతమైన క్షిపణిని రష్యా ప్రయోగించింది. శక్తిమంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి పరీక్షను రష్యా చేపట్టింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కాగా, జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి.. ధ్వని వేగం కన్నా 9 రెట్లు (గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగా దూసుకెళ్తుంది. బాలిస్టిక్‌ తరగతికి చెందని క్షిపణుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఇది దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదు. బారెంట్స్‌ సముద్రంలోని అడ్మిరల్‌ గోర్షోవ్‌ ఫ్రిగేట్‌ యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్‌ వెయ్యి కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ తెలిపింది. 

మరోవైపు.. జిర్కాన్‌ క్షిపణిని శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవని రష్యా సైనికాధికారులు చెబుతున్నారు. ఈ క్షిపణిలో వాడిన అప్‌గ్రేడెడ్‌ ఇంధనంవల్లే అది మెరుపులా దూసుకెళ్లగలుగుతుందని పేర్కొన్నారు. ఈ వేగం కారణంగా జిర్కాన్‌ ముందు భాగంలోని వాయుపీడనం.. క్షిపణి చుట్టూ ప్లాస్మా మేఘాన్ని ఏర్పరుస్తుంది. అది శత్రు రాడార్‌ నుంచి వచ్చే రేడియో తరంగాలను శోషించుకుంటుంది. ఫలితంగా దీన్ని శత్రుదేశాలు పసిగట్టలేవని రక్షణ శాఖ తెలిపింది. 

ఇక, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణి ‘కింజాల్‌’ను మార్చిలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన విషయం తెలిసిందే. మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా రష్యా చిన్న పట్టణాలను తన అధీనంలోకి తీసుకుంటున్నది. కాగా, జిర్కాన్‌ సాయంతో అమెరికా విమానవాహక నౌకలను సైతం కూల్చేయవచ్చని రష్యా అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి:మాయమైతే.. పైసలు వాపస్‌

మరిన్ని వార్తలు