ఖెర్సన్‌.. గేమ్‌ చేంజర్‌?

14 Nov, 2022 05:08 IST|Sakshi

అవమానకర రీతిలో నిష్క్రమించిన రష్యా

పుతిన్‌కు గట్టి ఎదురుదెబ్బ

యుద్ధ గతినే మార్చే అవకాశం 

ఎస్‌.రాజమహేంద్రారెడ్డి
 ఖెర్సన్‌. ఈ ఓడరేవు పట్టణం ఇక తమదేనని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆర్భాటంగా ప్రకటించి ఎన్నో రోజులు కాలేదు! ఉన్నట్టుండి ‘ఖెర్సన్‌ను వీడుతున్నాం. మా సేనలను అక్కణ్నుంచి వెనక్కు రప్పిస్తున్నాం’ అంటూ రష్యా అధికారులు ప్రకటించడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. రష్యా హఠాత్తుగా ఒక అడుగు వెనక్కు ఎందుకేసింది? నిజంగానే రష్యా సేనలు ఖెర్సన్‌పై పట్టు కోల్పోయాయా? లేదంటే ఈ వెనకడుగు వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమా...?

జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుందంటారు. పుతిన్‌కు అది ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నట్టుంది. ఖెర్సన్‌ సహా ఉక్రెయిన్‌లోని నాలుగు పట్టణాలు తమ అధీనంలోకి వచ్చాయని దాదాపు నెలకింద చిరునవ్వులు చిందిస్తూ పుతిన్‌ కాస్త ఆర్భాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఖెర్సన్‌ నుంచి సేనల ఉపసంహరణ విషయాన్ని మాత్రం రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు వెల్లడించారు. రష్యా ప్రజలకు రుచించని విషయాల వెల్లడికి వీలైనంత దూరంగా ఉండటం పుతిన్‌కు అలవాటే.

అందుకే షరామామూలుగా ఖెర్సన్‌ నుంచి వెనకడగు ప్రకటనలోనూ ఆయన మొహం చాటేశారు. ఆ బాధ్యతను రక్షణ మంత్రికి, ఇతర సైనిక ఉన్నతాధికారులకు అప్పగించడం ద్వారా వారిని వ్యూహాత్మకంగా టీవీల ముందుకు తీసుకొచ్చారు. తద్వారా ఉక్రెయిన్‌తో యుద్ధంలో జరిగే అన్ని పరిణామాలకూ ఇకపై వాళ్లే బాధ్యులవుతారని పుతిన్‌ చెప్పినట్టయింది. కాకపోతే ఓటమిని రష్యా బహిరంగంగా అంగీకరించడమే చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఇలాంటి ఎదురుదెబ్బలను రష్యా అధికారికంగా అంగీకరించడం అత్యంత అరుదు. అదీ ప్రత్యక్ష ప్రసారంలో!

యుద్ధగతినే మార్చే పరిణామం!
ఖెర్సన్‌ నుంచి రష్యా సేనల ఉపసంహరణను ఉక్రెయిన్‌ తొలుత నమ్మలేదు. రష్యా వ్యూహాత్మకంగా వల విసిరిందని ఉక్రెయిన్‌ సైనికాధికారులు భావించారు. ఈ ప్రకటన పాచికేనని, రష్యా సైనికులు పౌరుల వేషంలో ఉక్రెయిన్‌ జనంతో కలిసిపోయి దొంగ దెబ్బ తీసేందుకు అదను కోసం ఎదురు చూస్తున్నారని అనుమానించారు. ఆ ఆస్కారమూ లేకపోలేదన్నది పరిశీలకుల మాట. ‘‘ఖెర్సన్‌ నుంచి సేనలను ఉపసంహరించాలని రష్యా చాలా రోజులుగా ఆలోచిస్తోంది. సుశిక్షితులైన సైనికుల స్థానంలో బలవంతంగా ఆర్మీలో చేర్చుకున్న పౌరులను ఖెర్సన్‌లో మోహరించడమే ఇందుకు నిదర్శనం’’ అని వారంటున్నారు.

ఉక్రెయిన్‌ దాడులను ముమ్మరం చేయడంతో ఖెర్సన్‌పై పట్టు బిగించడం తమకు దాదాపు అసాధ్యంగా మారిందని రష్యా సైనికాధికారి ఒకరన్నారు. ఖెర్సన్‌ను వదిలేసి నిప్రో నది పశ్చిమ తీరాన సేనలను మోహరిస్తే తమ స్వాధీనంలోని మిగతా ప్రాంతాలను కాపాడుకోవచ్చని రష్యా భావించినట్టు కన్పిస్తోంది. ఉధృతమైన నిప్రో ప్రవాహమే ఉక్రెయిన్‌ సేనలను నది దాటకుండా అడ్డుకుంటుందన్నది వారి ఆలోచన. మొత్తంమీద ఖెర్సన్‌ నుంచి రష్యా నిష్క్రమణ యుద్ధగతిని పూర్తిగా మార్చేయడం ఖాయంగా కన్పిస్తోంది. గెలుపోటముల భవిష్యత్తును శాసించేలా ఉంది. స్థూలంగా ఇది రష్యాకు మింగుడు పడని పరిణామమే.

మరిన్ని వార్తలు