నగరాల్లో హోరాహోరీ..ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌ బలగాలు

28 Feb, 2022 05:02 IST|Sakshi
వైకల్యాన్ని సైతం లెక్కచేయక కీవ్‌లో పోరుకు సిద్ధమైన ఉక్రెయిన్‌ మాజీ పోలీసు

ఉక్రెయిన్‌ పట్టణాల్లోకి రష్యా సేనలు

ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌ బలగాలు

ఖార్కివ్‌లో వీధి పోరాటాలు

బంకర్లలో భయంభయంగా ప్రజలు

కీలక పోర్టులు స్వాధీనం చేసుకున్న రష్యా

భద్రతా మండలి నుంచి రష్యాను బహిష్కరించాలన్న జెలెన్‌స్కీ

కీవ్‌: ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా సేనలు కీలక పట్టణాల్లోకి చొచ్చుకువస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో రష్యా బలగాలకు, ఉక్రెయిన్‌ మిలటరీకి మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎయిర్‌ఫీల్డ్స్, ఇంధన నిల్వాగారాలపై దాడులు చేసిన రష్యా బలగాలు ఆదివారం నాటికి ఉక్రెయిన్‌లోని కీలక నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు చర్చలకోసం బెలారస్‌కు బృందాన్ని పంపినట్లు రష్యా ప్రకటించింది. కానీ తమ దేశం నుంచి దాడులకు కేంద్రమైన బెలారస్‌లో చర్చలకు వెళ్లమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.

మరే దేశంలోనైనా చర్చలకు సిద్ధమని తొలుత చెప్పారు, కానీ బెలారస్‌ సరిహద్దుల్లో చర్చలకు సిద్ధమని తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఆదివారం రష్యాలోని ఖార్కివ్‌ నగరం సమీపంలోకి రష్యా సేనలు చొచ్చుకువచ్చాయి. వీరిని ఉక్రెయిన్‌ బలగాలు ఎదుర్కొంటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నగరం తూర్పున ఉన్న గ్యాస్‌ లైన్‌ను రష్యా సేనలు పేల్చివేశాయి. రష్యా నుంచి కాపాడేందుకు అందరూ ఆయుధాలు ధరించాలన్న అధ్యక్షుడి పిలుపుతో పలువురు ఉక్రేనియన్లు కదనరంగంలో పోరాడుతున్నారు. దీంతో రష్యన్‌ బలగాలకు చాలాచోట్ల ప్రతిఘటన ఎదురవుతోంది.

పోరాడుతాం...: ‘‘మేం మా దేశం కోసం పోరాడుతున్నాం, మా స్వతంత్రం కోసం పోరాడుతున్నాం, ఎందుకంటే దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడే హక్కు మాకుంది.’’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం ప్రకటించారు. దేశమంతా బాంబులతో దద్దరిల్లుతోందని, పౌర నివాసాలను కూడా విడిచిపెట్టడం లేదని ఆయన వాపోయారు. కీవ్‌ సమీపంలో భారీ పేలుళ్లతో పాటు మంటలు కనిపించాయి. దీంతో ప్రజలంతా భయంతో బంకర్లలో, సబ్‌వేల్లో దాక్కుంటున్నారు. నగరంలో 39 గంటల కర్ఫ్యూ విధించారు. కీవ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా పేలుళ్లు వినిపించాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. రష్యాది ఉగ్రవాదమని జెలెన్‌స్కీ దుయ్యబట్టారు. తమ నగరాలపై రష్యా దాడులకు సంబంధించి అంతర్జాతీయ యుద్ధనేరాల ట్రిబ్యునల్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రష్యాను ఐరాస భద్రతా మండలి నుంచి తొలగించాలన్నారు.  

తీరప్రాంత స్వాధీనం
ఉక్రెయిన్‌ దక్షిణాన ఉన్న కీలక నౌకాశ్రయ నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో ఉక్రెయిన్‌ తీరప్రాంతం రష్యా అదుపులోకి వచ్చినట్లయింది. నల్ల సముద్రంలోని ఖెర్సన్, అజోవ్‌ సముద్రంలోని బెర్డిన్స్‌క్‌ పోర్టులను స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించారు. పలు నగరాల్లో విమానాశ్రయాలు కూడా తమ అదుపులోకి వచ్చాయన్నారు. అయితే ఒడెసా, మైకోలైవ్‌ తదితర ప్రాంతాల్లో పోరు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. పోర్టులు చేజారడం ఉక్రెయిన్‌కు ఎదురుదెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు.

పొంతన లేని గణాంకాలు
యుద్ధంలో ఇరుపక్షాల్లో ఎంతమంది మరణించారు, గాయపడ్డారు అన్న విషయమై సరైన గణాంకాలు తెలియడంలేదు. రష్యాదాడిలో 198 మంది పౌరులు చనిపోయారని, వెయ్యికిపైగా గాయాలపాలయ్యారని ఉక్రెయిన్‌ ఆరోగ్యమంత్రి చెప్పారు. రష్యాసేనల్లో 3,500మంది చనిపోయారని ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. దాడులు ఆరంభమైన తర్వాత సుమారు 3.68 లక్షలమంది ఉక్రేనియన్లు పొరుగుదేశాలకు వలసపోయారని ఐరాస తెలిపింది. ఒకపక్క రష్యా సేనలు ఉక్రెయిన్‌లోకి చొచ్చుకుపోతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు పలురకాల ఆయుధాలు, మందుగుండు సమాగ్రిని సమకూరుస్తున్నాయి.

అదే సమయంలో రష్యాపై భారీ ఆంక్షలను విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు 35 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. 500 మిస్సైళ్లు, 1000 యాంటీ టాంక్‌ ఆయుధాలను పంపుతామని జర్మనీ తెలిపింది. బెల్జియం, చెక్, డచ్‌ ప్రభుత్వాలు కూడా ఆయుధాలు పంపుతున్నాయి. ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను స్విఫ్ట్‌ (అంతర్జాతీయ బ్యాంకు అనుసంధానిత వ్యవస్థ) నెట్‌వర్క్‌లో బ్లాక్‌ చేసేందుకు యూఎస్, యూకే, ఈయూ అంగీకరించాయి. ఉక్రెయిన్‌లో తమ స్టార్‌లింగ్‌ ఇంటర్‌నెట్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేస్తున్నట్లు  బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు.

ఐరాస అత్యవసర భేటీ!
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై చర్చకు 193 మంది సభ్యులతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భేటీ కోసం భద్రతా మండలిలో ఓటింగ్‌ జరగనుంది. భద్రతామండలి పూర్తి సమావేశంలో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. దాడిపై భద్రతా మండలి తీర్మానాన్ని శుక్రవారం రష్యా వీటో చేయడం తెలిసిందే.

రష్యా విమానాలపై ఈయూ నిషేధం
రష్యా విమానాలను తమ గగనతలంపై నిషేధించాలని 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చాలని నిర్ణయించామని ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా చెప్పారు. ఈయూ చరిత్రలో దాడికి గురవుతున్న దేశానికి ఆయుధ సాయం కోసం నిధులందించడం ఇదే తొలిసారన్నారు. 

మరిన్ని వార్తలు