Russia Ukraine Invasion: ఉక్రెయిన్‌ అణ్వాయుధాలు ఏమయ్యాయి?

26 Feb, 2022 06:40 IST|Sakshi

Russia-Ukraine: 1991లో సోవియెట్‌ యూనియన్‌ పతనమైన తర్వాత ఆ దేశానికి సంబంధించిన అణ్వాయుధాలన్నీ బెలారస్, కజకస్తాన్, ఉక్రెయిన్‌లో ఉండేవి. అందులోనూ ఉక్రెయిన్‌ అతి పెద్ద అణు భాండాగారంగా నిలిచింది. ప్రపంచంలోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్న మూడో దేశంగా అవతరించింది. సైనిక స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగిన 3 వేలకు పైగా టాక్టికల్‌ అణ్వాయుధాలు, యుద్ధ నౌకలు, సాయుధ వాహనాలు, నగరాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసే అణ్వాయుధాలు ఉక్రెయిన్‌ దగ్గరే ఉండేవి. వీటిలో ఎస్‌ఎస్‌–19, ఎస్‌ఎస్‌–24 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు 176 వరకు ఉంటే, మరో వెయ్యి వరకు గగన తలం మీదుగా దాడి చేసే క్షిపణి వ్యవస్థలన్నీ ఉక్రెయిన్‌ దగ్గరే ఉన్నాయి.

చదవండి: (Vladimir Putin: అదే పుతిన్‌ బలమా..?)

60 వరకు టీయూ–22 బాంబర్లు కూడా ఉండేవి. ఆ తర్వాత కాలంలో అతి పెద్ద ఆయుధాగారాన్ని నిర్వహించే ఆర్థిక శక్తి లేక ఉక్రెయిన్‌ అల్లాడిపోయింది. అంతే కాకుండా ఆ అణ్వాయుధాలను వాడడానికి అవసరమైన కేంద్రీకృత ఫైరింగ్‌ కంట్రోల్స్‌ అన్నీ రష్యా రాజధాని మాస్కోలో ఉన్నాయి. దీంతో అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ అణ్వాయుధాలు ఒక తలనొప్పిగా మారాయి. చర్చోపచర్చల తర్వాత ఆ ఆయుధాలను నాశనం చేయడానికి వీలుగా 1994లో రష్యా, యూకే, అమెరికాలతో ఉక్రెయిన్‌ బుడాపెస్ట్‌ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

చదవండి: (ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం)

ఆయుధాలను విధ్వంసం చేసినప్పటికీ ఆ దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని గుర్తిస్తామని అమెరికా, యూకే, రష్యాలు హామీ ఇచ్చాయి. దీంతో ఎన్నో వార్‌హెడ్లు, ఇతర క్షిపణుల్ని ధ్వంసం చేసింది. టీయూ–160 బాంబర్లు, ఇతర అణుసామాగ్రిని రష్యాతో వస్తుమార్పిడి విధానం కుదుర్చుకొని ఆ దేశానికి బదలాయించింది. బదులుగా రష్యా చమురు, గ్యాస్‌లను సరఫరా చేసింది. 2001 మేలో చివరి యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది. అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ అసోసియేషన్‌ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌ 11టీయూ–160 వ్యూహాత్మక బాంబులు, 27 వ్యూహాత్మక టీయూ–95 బాంబులు, 483 కేహెచ్‌–55 గగన తలం మీదుగా ప్రయోగించే క్రూయిజ్‌ క్షిపణుల్ని ధ్వంసం చేసిందని, మరో 11 భారీ బాంబులు 582 వ్యూహాత్మక క్రూయిజ్‌ క్షిపణుల్ని రష్యాకు అప్పగించిందని వెల్లడించింది. 

>
మరిన్ని వార్తలు