ఉక్రెయిన్‌ వర్సెస్‌ రష్యా.. ప్రాణం తీయకుండానే దెబ్బ?? ‘ప్లాన్‌ సీ’తో ఎలాగంటే..

21 Feb, 2022 19:03 IST|Sakshi

Russia Ukraine Conflict: ఒకవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, పుతిన్‌ నడుమ చర్యలపై రష్యా యూటర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ చెప్పినట్లు.. ఇరు దేశాల అధ్యక్షుల నడుమ ఫేస్‌ టు ఫేస్‌ చర్చలు ఉండబోవని, కేవలం ఉక్రెయిన్‌ అంశం ఆధారంగా ‘భద్రత, యూరప్‌లో వ్యూహాత్మక స్థిరత్వం’ కోసం ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధుల మధ్య మాత్రమే భేటీ జరగొచ్చని పేర్కొంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఇంకా ఆవరించే ఉండగా.. తాజాగా ఉక్రెయిన్‌ అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేసింది. 

రష్యా ప్లాన్‌ సీ తరహా దాడులకు సిద్ధమైనట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్లాన్‌ సీ అంటే ఏంటో కాదు.. సీ అంటే సైబర్‌ దాడులు. రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా భారీ ఎత్తున్న సైబర్‌ ఎటాక్‌లు జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం ఈ దాడులు జరిగే అవకాశం ఉండొచ్చని, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలను అప్రమత్తం చేసింది ఉక్రెయిన్‌ ప్రభుత్వం.

అయితే రష్యా, ఉక్రెయిన్‌పై సైబర్‌ దాడులకు పాల్పడడం కొత్తేం కాదు. కానీ, సరిహద్దు పరిణామాల తర్వాత ఉక్రెయిన్‌లో సైబర్‌ దాడులు పెరిగిపోయాయి. ఈ దాడుల వెనుక రష్యానే ఉందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తూ వస్తోంది కూడా. అయితే మాస్కో అధికారులు మాత్రం ఆ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వ ఆధీనంలోని సైబర్‌ సెక్యూరిటీ సీఈఆర్‌టీ-యూఏ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది.

ఉక్రెయిన్‌ బ్యాంకింగ్‌తో పాటు రక్షణ వ్యవస్థకు కూడా ముప్పు పొంచి ఉందని వారించింది ఆ ఏజెన్సీ. ఉక్రెయిన్‌ ఆక్రమణకు సిద్ధపడిన నేపథ్యంలో.. ముందుగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని రష్యా భావిస్తున్నట్లు పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజధాని కీవ్‌లో ఉన్న ప్రముఖ బ్యాంకులు,  ప్రభుత్వ ఏజెన్సీలను మాస్కో ప్రభుత్వ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. గతవారం ఉక్రెయిన్‌ రక్షణ విభాగపు వెబ్‌సైట్‌, పలు బ్యాంకుల వెబ్‌సైట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన టెర్మినల్ సేవలకు విఘాతం ఏర్పడింది. దీని వెనుక మాస్కో హ్యాకర్ల హస్తం ఉందనేది ఉక్రెయిన్‌ ఆరోపణ. ఇప్పటికే యుద్ధవాతావరణంతో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ దారుణంగా కుదేలు అయిన సంగతి తెలిసిందే.


​  
మరోవైపు సరిహద్దులో పరిస్థితులు చల్లారినట్లే కనిపిస్తున్నప్పటికీ.. పశ్చిమ భాగంలో మోహరింపులు, వేర్పాటువాదుల నుంచి ఉక్రెయిన్‌పై దాడులు, ప్రతిగా ఉక్రెయిన్‌ జరుపుతున్న దాడుల్లో రష్యాకు ఆస్తి నష్టం వాటిల్లుతుండడం లాంటి పరిణామాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా.. రష్యా భూభాగంలో ఉక్రెయిన్‌కు చెందిన ఐదుగురు విధ్వంసకారులను హతమార్చినట్లు రష్యా సైన్యం ప్రకటించింది.

సంబంధిత వార్త: భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్‌లో చుక్కలు.. పరిస్థితి చెయ్యి దాటిందా?

మరిన్ని వార్తలు