ఉక్రెయిన్‌-రష్యా సైనికుల కౌగిలింత ‘అత్యంత ప్రమాదకరం’.. కలలో కూడా సరికాదు!

5 Sep, 2022 15:04 IST|Sakshi

వైరల్‌: సద్దుదేశంతో ఓ ఆర్టిస్ట్‌ గీసిన చిత్రం.. తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా బాధిత దేశం నుంచి అభ్యంతరాలు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ ఆర్ట్‌ వర్క్‌ను ఎట్టకేలకు తొలగించాల్సి వచ్చింది. 

ఉక్రెయిన్‌-రష్యా సైనికులు కౌగిలించుకున్నట్లు ఓ కుడ్యచిత్రంను(మ్యూరాల్‌) మెల్‌బోర్న్‌(ఆస్ట్రేలియా)నగరంలో ప్రదర్శించారు. పీటర​ సీటన్‌ అనే ఆర్టిస్ట్‌.. ఇరు దేశాల మధ్య శాంతియుత ప్రయత్నాలను ప్రతిబింబించేలా ఒకరాత్రంతా కష్టపడి దానిని వేశాడు. అయితే.. 

ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని ఉక్రెయిన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్‌ రాయబారి వసైల్‌ మైరోష్నిచెంకో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి దండయాత్ర వాస్తవికతను వక్రీకరించే ప్రయత్నమంటూ మండిపడ్డారాయన. 

ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్‌ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశమే. అది గీసిన ఆర్టిస్ట్‌కు బహుశా రష్యా ఆక్రమణ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయి ఉండొచ్చు. రష్యాను శాంతికాముక దేశంగా చిత్రీకరించే యత్నం చేయడం దుర్మార్గం. వేలమందిని బలిగొన్న ఈ మారణహోమంపై ఇలాంటి చిత్రం.. కలలో కూడా ఈ ఊహ సరికాదు. ఉక్రెయిన్‌ కమ్యూనిటీ సంప్రదించకుండా దానిని ప్రదర్శించడం విచారకరం అంటూ ట్విటర్‌లో షేర్‌ చేశారాయన. వీలైనంత త్వరగా దానిని తొలగించాలని డిమాండ్‌ చేశారాయన. 

మరోవైపు ప్రముఖ సోషియాలజిస్ట్‌ ఓల్గా బోయ్‌చక్‌ ఈ వ్యవహారంపై మండిపడ్డారు. నిందితుడిని-బాధితుడిని ఒకేలా చూపించే ప్రయత్నం సరికాదని, దీని వెనుక ఏదైనా గూఢపుఠాణి ఉండొచన్న అనుమానాలు వ్యక్తం చేశారు. 

ఒకవైపు ఆ ఆర్ట్‌వర్క్‌కు పాజిటివ్‌ కామెంట్లు, లైకులు దక్కినప్పటికీ.. విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో దానిని తొలగించారు సీటన్‌. అంతేకాదు.. దీనిని నెగెటివ్‌గా తీసుకుంటారని తాను అనుకోలేదని చెబుతూ.. క్షమాపణలు తెలియజేశారు. 

ఇదీ చదవండి: కత్తి దూసిన ఉన్మాదం.. పదిమంది దారుణహత్య

మరిన్ని వార్తలు