Russia-Ukraine War: అపార్టుమెంట్‌పై రష్యా మృత్యుపాశం

2 Jul, 2022 04:56 IST|Sakshi

సెర్హివ్‌కాలో ఎక్స్‌–22 మిస్సైళ్ల ప్రయోగం

19 మంది బలి.. 38 మందికి గాయాలు

తూర్పు ఉక్రెయిన్‌లో భీకర దాడులు

కీవ్‌: పశ్చిమ ఉక్రెయిన్‌లో చిన్నపట్టణమైన సెర్హివ్‌కాలో రష్యా సైన్యం మారణకాండ సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామునే క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఓ అపార్టుమెంట్‌ ధ్వంసమయ్యింది. 19 మంది సాధారణ పౌరులు మరణించారని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు తెలిపాయి. నల్లసముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌ నుంచి రష్యా సేనలు వెనక్కి మళ్లిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం.

ఉక్రెయిన్‌లోని కీలకమైన రేవు నగరంఒడెసాకు 50 కిలోమీటర్ల దూరంలో సెర్హివ్‌కా ఉంది. అపార్టుమెంట్‌పై క్షిపణి దాడి దృశ్యాలు మీడియాలో కనిపించాయి. రష్యా బాంబర్లు ఎక్స్‌–22 మిస్సైళ్లను అపార్టుమెంట్‌తోపాటు రెండు క్యాంప్‌సైట్లపై ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారని, 38 మంది గాయపడ్డారని సమాచారం. వారిలో ఆరుగురు బాలలు, ఒక గర్భిణి ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో చాలామంది అపార్టుమెంట్‌ వాసులే.

లీసిచాన్‌స్క్‌లో భీకర దాడులు
తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌ను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు దాడులను ఉధృతం చేస్తున్నాయి. లీసిచాన్‌స్క్‌ నగర శివార్లలోని చమురు శుద్ధి కర్మాగారంపై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఒక్కో ఇంటిని ధ్వంసం చేస్తోందని అధికారులన్నారు. ఆయిల్‌ రిఫైనరీ, జిలెటిన్‌ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుందన్నారు. వైమానిక దాడుల్లో ఖర్కీవ్‌లో నలుగురు, డోంటెస్క్‌లో మరో నలుగురు మరణించారని సమాచారం.

మరిన్ని వార్తలు