Russia-Ukraine war: మరో 4 నెలలు?

13 Jun, 2022 06:34 IST|Sakshi

అక్టోబర్‌ దాకా యుద్ధం: ఉక్రెయిన్‌

డోన్బాస్‌ చిక్కితే ముందే ముగిసే చాన్స్‌

తూర్పున కొనసాగుతున్న హోరాహోరీ

కీవ్‌:  రష్యా తెర తీసిన అకారణ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్‌ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు. ‘‘డోన్బాస్‌లో రోజుల వ్యవధిలో చేజిక్కించుకుంటానని ఫిబ్రవరిలో యుద్ధ ప్రారంభంలో రష్యా ఆశ పడింది. నాలుగు నెలలవుతున్నా అక్కడ పోరాటం సాగుతూనే ఉంది. అక్కడ రష్యా బలగాలను సమర్థంగా అడ్డుకుంటున్న మా సేనలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’ అన్నారు.

యుద్ధం తొలినాళ్లలో ఆక్రమించుకున్న దక్షిణ ఖెర్సన్‌ నుంచి కూడా రష్యా బలగాలను తాజాగా వెనక్కు తరిమినట్టు ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో పౌరులకు రష్యా పాస్‌పోర్టుల జారీ, రష్యా చానళ్ల ప్రసారం, రష్యా స్కూలు యూనిఫాం ప్రవేశపెట్టడం వంటివి జరుగుతుండటం తెలిసిందే. యుద్ధ లక్ష్యాలను త్వరగా సాధించలేమన్న వాస్తవాన్ని రష్యా అర్థం చేసుకుందని, అందుకే అక్టోబర్‌ దాకా పోరు కొనసాగించాలని నిర్ణయించుకుందని ఉక్రెయిన్‌ సైన్యం అంచనా వేస్తోంది. డోన్బాస్‌ చిక్కితే ముందుగానే ముగించొచ్చని భావిస్తోంది.
చదవండి: Russia-Ukraine war: మెక్‌డొనాల్డ్స్‌ రీ ఓపెన్‌

హోరాహోరీ
లుహాన్స్‌క్‌లో ఉక్రెయిన్‌ అధీనంలో ఉన్న చివరి పెద్ద పట్టణాలు సెవెరోడొనెట్స్‌క్, లిసిచాన్స్‌క్‌ల్లో హోరాహోరీ జరుగుతోంది. సెవెరోడొనెట్స్‌క్‌లోని కెమికల్‌ ప్లాంటులో 400 మంది దాకా ఉక్రెయిన్‌ సైనికులు చిక్కుపడ్డారని సమాచారం. మారియుపోల్‌లోనూ ఇలాగే చిక్కుబడ్డ వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు నెలల తరబడి పోరాడి చివరికి లొంగిపోవడం, వారిని రష్యా యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్లడం తెలిసిందే.  ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తున్న పశ్చిమ దేశాలే శాంతి ప్రక్రియకు సంధి కొడుతున్నాయని చైనా మండిపడింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చలకు తమ మద్దతుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి జనరల్‌ వెయ్‌ ఫెంగ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు