Russia Ukraine War: అది ఒక బీర్.. కానీ, ఇప్పుడు అదే ఉక్రెయిన్‌ ‘ఆయుధం’!

28 Feb, 2022 13:28 IST|Sakshi

ఉక్రెయిన్‌ నగరం లీవ్‌..  పోలాండ్‌ బార్డర్‌కి 70 కిలోమీటర్ల దూరం.  ఆ భూభాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న రష్యా దళాలకు రెండు రోజులుగా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. సైన్యం తుటాలు, బాంబులతో పాటు గాల్లోంచి పడుతున్న బీర్‌ సీసాలు.. భారీ శబ్ధాలతో పేలిపోతున్నాయి. దీంతో రష్యా బలగాలు అక్కడే ఆగిపోయాయి. ఇంతకీ ఆ బీర్‌.. ఎందుకలా పేలిపోతున్నాయో చెప్తున్నారు  ప్రావ్డా బ్రూవరీ యజమాని యూరై జాస్టనీ. 


ఉక్రెయిన్ లోని లివ్ పట్టణానికి చెందిన ప్రావ్డా బ్రూవరీ బీర్ల తయారీకి ప్రసిద్ధి. కానీ, యుద్ధం నేపథ్యంలో బీర్ల తయారీని ఆపేసింది ఈ కంపెనీ. అందుకు బదులుగా రష్యా సైన్యం కోసం ప్రత్యేకంగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ తయారు చేస్తోంది. తాగడానికి కాదు.. లేపేయడానికి!. ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగులు హుషారుగా ఈ బాటిల్‌ బాంబులను తయారు చేస్తున్నారు. 

ఈ బీర్‌ బాటిళ్లలో ఆయిల్‌, పెట్రోల్‌ మిక్స్‌ చేసి వాడేస్తున్నారు. అందులో గుడ్డను ముంచి రష్యా బలగాల వైపునకు విసిరేస్తున్నారు. లోపల ఉండే కాక్ టెయిల్ పెట్రోల్, ఆల్కహాల్ మాదిరే మండే స్వభావంతో ఉంటుంది. సీసా మూతభాగంలో ఉన్న వస్త్రానికి అగ్గి రాజేసి శుత్రు సేనలపై విసిరి కొడితే అవతలి వాళ్ల పని మటాషే!. ఉక్రెనియన్‌ టెర్రిటోరియల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ల కోసం శనివారం నుంచి తయారు చేస్తున్నారు. 

2014 క్రిమియా సంక్షోభం సమయంలోనూ ప్రత్యర్థుల మీద ఈ తరహా దాడులు జరిగాయట. ఆ సమయంలో కంపెనీలో పని చేసిన ఓ వ్యక్తి.. అప్పటి విషయాన్ని గుర్తు చేయడంతో మళ్లీ బీర్‌ బాటిల్‌ బాంబులు తయారవుతున్నాయి. ఈ యుద్ధానికి మద్దతుగా మేము మా వంతుగా ప్రతిదీ చేస్తాం. ఎవరో ఒకరు దీన్ని చేయాలి. 2014లోనూ దీన్ని తయారు చేసి వినియోగించిన దాఖలాలున్నాయి. మా ఉద్యోగి ఒకరికి మెలటోవ్ కాక్ టెయిల్ తయారీ గురించి తెలుసు. అందుకే దీన్ని తయారు చేయడం మొదలు పెట్టాం అని చెప్తున్నారు యూరై. ఇదిలా ఉంటే ఈ కంపెనీ గతంలోనూ ‘పుతిన్‌ ఖుయ్‌లో’ అంటూ పుతిన్‌ అవమానిస్తూ గతంలో బీర్లు తయారు చేసింది. అవి భయంకరంగా అమ్ముడు పోయేవి కూడా.

మరిన్ని వార్తలు