ఉక్రెయిన్‌కు స్పీడుగా సహాయం

30 Apr, 2022 06:25 IST|Sakshi
దాడుల్లో కీవ్‌లో దెబ్బతిన్న అపార్ట్‌మెంట్‌

కీలక బిల్లుకు అమెరికా ఆమోదం

దాడులు కొనసాగిస్తున్న రష్యా

ఐరాస చీఫ్‌ ఉండగానే దాడులు

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌తో పాటు తూర్పు యూరప్‌లోని మిత్రదేశాలకు మరింత సాయం వేగంగా అందించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీనికింద రష్యా ఆక్రమణను నిరోధించేందుకు ఈ దేశాలకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తారు. తమ మద్దతుతో రష్యాపై ఉక్రెయిన్‌ గెలుస్తుందని యూఎస్‌ ప్రతినిధి గ్రెగరీ మీక్స్‌ చెప్పారు. ఆ దేశానికి మరో 3,000 కోట్ల డాలర్ల సాయమందించేందుకు అమెరికా కాంగ్రెస్‌ మద్దతు కోరతానని అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు.

డోన్బాస్‌పైనే ఫోకస్‌
తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. వాటిని ఉక్రెయిన్‌ సమర్థంగా అడ్డుకుంటోందని బ్రిటన్‌ తెలిపింది. ఐరాస చీఫ్‌ గుటెరస్‌ కీవ్‌లో పర్యటిస్తుండగానే ఆ నగరంపై రష్యా తీవ్ర దాడులకు దిగింది. అక్కడి మిలటరీ ఫ్యాక్టరీపై దాడి చేశామని ప్రకటించింది.

వరదలతో నిరోధం
కీవ్‌ను సమీపించకుండా రష్యా సేనలను నిరోధించేందుకు పరిసర గ్రామాలను ప్రజలు నీటితో ముంచెత్తుతున్నారు. దీనివల్ల మౌలిక వసతులు దెబ్బతింటున్నా పర్లేదంటున్నారు. శత్రువుల ఆక్రమణ ముప్పు కన్నా ఆస్తి నష్టం ఎక్కువేమీ కాదని చెప్పారు. ఇటీవలే దెమిదివ్‌ గ్రామ ప్రజలు ఇలాగే రష్యా సేనలను నిలువరించారు.

ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌ మృతి
ఉక్రెయిన్‌ సైన్యం కీలకమైన జవానును కోల్పోయింది. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’గా పేరు పొందిన మేజర్‌ స్టెపాన్‌ టారాబాల్కా(29) గత నెలలో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. అతను 40 రష్యా యుద్ధ విమానాలను నేలకూల్చాడని ఉక్రెయిన్‌ చెబుతోంది.  

‘ఉక్రెయిన్‌’ వైద్య విద్యార్థులకు సుప్రీం ఊరట
న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఉక్రెయిన్‌తో పాటు ఇతర దేశాల నుంచి మధ్యలో వచ్చిన వాళ్లు స్థానిక కాలేజీల్లో అడ్మిషన్‌ పొందేందుకు రెండు నెలల్లో పథకం రూపొందించాలని జాతీయ వైద్య కమిషన్‌ను శుక్రవారం ఆదేశించింది. స్వదేశీ కాలేజీల్లో చేరికకు అవసరమైన క్లినికల్‌ ట్రైనింగ్‌ను ఈ పథకంలో భాగంగా అందిస్తారు.

చైనా వర్సిటీకి చెందిన ఓ వైద్య విద్యార్థిని సూత్రప్రాయంగా రిజిస్టర్‌ చేసుకోవాలంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్‌ఎంసీ సుప్రీంలో సవాలు చేసింది. మానవాళికి కరోనా కొత్త సవాళ్లు విసిరిందని విచారణ సందర్భంగా ఎన్‌ఎంసీకి జస్టిస్‌ గుప్తా, జస్టిస్‌ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చైనా వర్సిటీలో క్లినికల్‌ శిక్షణ పూర్తి చేసుకోనంత మాత్రాన విద్యార్థి ప్రతిభ వృథా కాకూడదని అభిప్రాయపడింది. వారికి ఒక్క అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇలాంటి విద్యార్థులను ఎన్‌ఎంసీ ఒక నెలలో పరీక్షించవచ్చని, సరైన శిక్షణ పొందారని కమిషన్‌ భావిస్తే దేశీయంగా 12 నెలల ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసేందుకు వారికి వీలు కల్పించవచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు