Russia-Ukraine war: ఉక్రెయిన్‌కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు: జర్మనీ

26 Jan, 2023 06:06 IST|Sakshi

బెర్లిన్‌:  తమ మిత్ర దేశాలకు కచ్చితంగా సహకరిస్తామని జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ హామీ ఇచ్చారు. రష్యా సైన్యంపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అత్యాధునిక లియోపార్డ్‌–2 ఏ6 యుద్ధ ట్యాంకులు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌కు తమ సొంత ఆయుధాగారం నుంచి తొలుత ఒక కంపెనీలు ట్యాంకులను (14 వాహనాలు) పంపించనున్నట్లు జర్మనీ ప్రభుత్వం ఒక తాజాగా ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్‌కు మొత్తం 88 యుద్ధ ట్యాంకులను త్వరలో సమకూర్చాలని జర్మనీతోపాటు మిత్రదేశాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌కు సాయం అందించే విషయంలో తమ మిత్ర దేశాలతో కలిపి పని చేస్తున్నామని ఒలాఫ్‌ షోల్జ్‌ వెల్లడించారు. తమ దేశంలో తయారైన అత్యాధునిక యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌ సైన్యం మరోసారి రష్యా సేనలపై ఎక్కుపెట్టబోతోందని జర్మనీ సైనికాధికారి ఎకెహర్డ్‌ బ్రోస్‌ చెప్పారు. రష్యా దండయాత్రను అడ్డుకొనేలా ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాల్సిన బాధ్యత పశ్చిమ దేశాలపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌కు అందుతున్న విదేశీ సైనిక సాయంపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు వినాశకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు