Russia-Ukraine war: రష్యా భీకర దాడులు

7 Jun, 2022 05:52 IST|Sakshi
డొనెట్క్స్‌లోని జవాన్లతో జెలెన్‌స్కీ సెల్ఫీ

సెవెరోడొనెట్స్‌క్‌లో హోరాహోరీ పోరు

కీవ్‌/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. సోమవారం నిర్దేశిత లక్ష్యాలపై లాంగ్‌–రేంజ్‌ మిస్సైళ్లు ప్రయోగించింది. ఖర్కీవ్‌ రీజియన్‌లోని లొజోవాలో ఉక్రెయిన్‌ సైనిక వాహనాల మరమ్మతు కేంద్రాన్ని ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగోర్‌ కొనాషెంకోవ్‌ ప్రకటించారు. అలాగే మరో 73 ఉక్రెయిన్‌ సైనిక శిబిరాలు, ఆయుధాగారాలు, మిలటరీ టార్గెట్లపై తమ సేనలు విరుచుకుపడినట్లు తెలిపారు.

సెవెరోడొనెట్స్‌క్‌లో ఇరు పక్షాల నడుమ హోరాహోరీ పోరాటం సాగుతోందని లుహాన్‌స్క్‌ గవర్నర్‌ సెర్హీవ్‌ హైడై చెప్పారు. నగరంలో పరిస్థితి నానాటికీ దిగజారుతోందన్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్‌ దళాలు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయని ప్రశంసించారు. సెవెరో డొనెట్స్‌క్‌ను కాపాడేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. సెవెరోడొనెట్స్‌క్‌తో పాటు సమీపంలోని లీసిచాన్‌స్క్‌పై రష్యా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ రెండు నగరాలను త్వరగా స్వాధీనం చేసుకోవాలన్న ఆరాటం రష్యాలో కనిపిస్తోంది. లీసిచాన్‌స్క్‌లో రష్యా దాడుల్లో ఓ బేకరీ ధ్వంసమయ్యింది. ఇక స్లొవియాన్‌స్క్, బఖ్‌ముత్‌ పట్టణాల్లోకి రష్యా దళాలు అడుగు పెట్టాయి. ఇక్కడి నుంచి సాధారణ ప్రజలకు బయటకు తరలిస్తున్నారు.  మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ నుంచి తమ సైనికుల మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ఉక్రెయిన్‌ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు