శాస్త్ర సాంకేతికతపై యుద్ధం పిడుగు

25 Mar, 2022 04:23 IST|Sakshi

నిలిచిపోతున్న కీలక ప్రాజెక్టులు

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి నెల రోజులు అవుతోంది. ఈ యుద్ధ ఫలితంగా వేలాదిమంది శరణార్థులుగా మారడంతో అతిపెద్ద మానవీయ సమస్య తలెత్తుతోంది. యుద్ధ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు, ఎరువులు, ఆహారపదార్థాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రష్యా దాడుల ప్రభావం ప్రపంచ శాస్త్ర పరిశోధన రంగంపై భారం మోపుతోంది. యుద్ధ కారణంగా కీలక ప్రాజెక్టులు రద్దు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ మానవ శాస్త్ర సాంకేతిక పురోగతిని దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధారంభం నుంచి ఇంతవరకు ప్రభావితమైన  సైన్సు సంబంధిత అంశాలు ఇలా ఉన్నాయి..

మార్స్‌ మిషన్‌
రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్‌ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇరు పక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సిఉంది. కేవలం ఎక్సోమార్స్‌ మిషన్‌ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టుల్లో రష్యా స్పేస్‌ ఏజెన్సీ రోస్కోమాస్‌తో బంధాలను తెంచుకుంటున్నట్లు యూరోపియన్‌ ఏజెన్సీ తెలిపింది.  

ఇంధన రంగం
ఉక్రెయిన్‌పై దాడితో ముందెన్నడూ చూడనటువంటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ముంచుకువస్తోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరీకరణకు ఈ ఏజెన్సీని 1973లో నెలకొల్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ సంక్షోభం తొలగిపోవాలంటే మిగిలిన దేశాలు ఉత్పత్తి పెంచితే సరిపోదని, ఇంధన పొదుపును అన్ని దేశాలు పాటించాలని ఏజెన్సీ సూచించింది.

ఇందుకోసం ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, విమానయానాలను తగ్గంచడం, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని వేగంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. దీంతోపాటు ఫార్మా, ఆహార రంగాల్లో పలు పరిశోధనలు యుద్ధం కారణంగా అటకెక్కనున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇంతవరకు మానవాళి సాధించిన సైన్సు విజయాలను ధ్వంసం చేస్తాయని ప్రపంచ పరిశోధకులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

ఐఎస్‌ఎస్‌ నిర్వహణ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నిర్మాణంలో రష్యా, అమెరికా కలిసి పనిచేశాయి. తాజా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఆవేశాలు పెరిగాయి. దీని ప్రభావం అంతరిక్ష ప్రయోగాలపై పడనుంది. ఇక మీదట ఇరుదేశాల ఉమ్మడిపాత్రపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఐఎస్‌ఎస్‌లో ఉన్న అమెరికా ఆస్ట్రోనాట్‌ మార్క్‌ వాండే మరో ఇద్దరు రష్యన్‌ కాస్మోనాట్స్‌తో కలిసి భూమి మీదకు రష్యా అంతరిక్ష వాహనంలో రావాల్సిఉంది.

ప్రస్తుతానికి ఈ ప్రయోగం వరకు సహకరించుకునేందుకు రష్యా, అమెరికా అంగీకారానికి వచ్చాయి. కానీ ఇకపై అమెరికాకు రాకెట్‌ విక్రయాలు చేపట్టమని రష్యా ప్రకటించింది. రష్యా దాడికి నిరసనగా అన్నట్లుగా రష్యన్‌ వ్యోమగాములు తమ ఐఎస్‌ఎస్‌ ప్రయాణంలో పసుపురంగు సూట్లు ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్యా దాడికి నిరసనగా ఉక్రెయిన్‌కు చెందిన ఈ రంగును కాస్మోనాట్లు వాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాము సాధారణంగానే ఈ రంగును ఎంచుకున్నట్లు కాస్మోనాట్లు చెబుతున్నారు. ముందుముందు ఐఎస్‌ఎస్‌పై రష్యా పట్టు తొలగిపోవచ్చన్న అనుమానాలున్నాయి.

– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు