Russia Ukraine war: కీవ్‌లో క్షిపణుల మోత

6 Jun, 2022 05:42 IST|Sakshi
కీవ్‌లో రష్యా దాడి దృశ్యం

ఉక్రెయిన్‌ రాజధానిపై రష్యా భీకర దాడులు

పశ్చిమ దేశాలు అందజేసిన యుద్ధ ట్యాంకులు, వాహనాలు ధ్వంసం

అణు విద్యుత్‌ కేంద్రంపై క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం  

కీవ్‌: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు రాకెట్‌ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తుండడం పట్ల రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడమే లక్ష్యంగా రష్యా సైన్యం ఆదివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. గత ఐదు వారాలుగా ప్రశాంతంగా ఉన్న కీవ్‌ మిస్సైళ్ల మోతతో దద్దరిల్లిపోయింది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందజేసిన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.

తమ సైన్యం అత్యంత కచ్చితత్వం కలిగిన లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లు ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. యూరప్‌ దేశాలు ఇచ్చిన టీ–72 యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ ఖండించింది. కీవ్‌లో రైల్వే స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలపైనా రష్యా సైన్యం దాడులకు పాల్పడింది.  రష్యా క్షిపణులు కీవ్‌ సమీపంలోని డార్నిట్‌స్కీ, డినిప్రోవ్‌స్కీ జిల్లాలను వణికించాయి.  కీవ్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని అణు విద్యుత్‌ కేంద్రంపై క్రూయిజ్‌ మిస్సైల్‌ను ప్రయోగించింది.

తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్‌లో పలు నగరాలు, గ్రామాలపై రష్యా సైన్యం మిస్సైళ్లు ప్రయోగించింది. గిర్‌స్కీలో 13, లీసిచాన్‌స్క్‌లో 5 ఇళ్లు దెబ్బతిన్నాయి. క్రామటోర్‌స్క్‌లోనూ వైమానిక దాడులు కొనసాగాయి. ఖర్కీవ్‌లోని చెర్‌కాస్కీ తీస్కీ గ్రామంలో రష్యా దళాలు ఫాస్ఫరస్‌ ఆయుధాలు ప్రయోగించాయని ఉక్రెయిన్‌ ఆరోపించింది.  డోన్బాస్‌లో కీలకమైన సీవిరోడోంటెస్క్‌ సిటీలో 80శాతం మేర రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి.  ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో మృతిచెందిన ఇరు పక్షాల సైనికుల మృతదేహాలను పరస్పరం మార్చుకొనే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యింది. దక్షిణ జపొరిఝాజియాలో 160 మృతదేహాలను మార్చుకున్నట్లు ఉక్రెయిన్‌ యంత్రాంగం ప్రకటించింది.

దయచేసి యుద్ధం ఆపండి: పోప్‌
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఇకనైనా ఆపాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ రష్యాకు మళ్లీ విజ్ఞప్తి చేశారు.  ‘దయచేసి ప్రపంచాన్ని నాశనం చేయకండి’ అని ఆదివారం ఆయన విన్నవించారు. యుద్ధం కారణంగా బాధితులుగా మారుతున్న ప్రజల రోదనలు వినాలని ఉక్రెయిన్, రష్యా అధినేతలను పోప్‌ కోరారు.

 

మరిన్ని వార్తలు