Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు

8 Apr, 2022 06:14 IST|Sakshi

నాటో దేశాల నిర్ణయం

రష్యావి అమానవీయ చర్యలని ఆరోపణ

డోన్బాస్‌పై పట్టుకు రష్యా యత్నాలు

కీవ్‌: ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలివ్వాలని నాటో కూటమి దేశాలు గురువారం నిర్ణయించాయి. రష్యా దారుణాలు నిజమేనని జర్మనీ నిఘా సంస్థ ధృవీకరించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఒక కూటమిలాగా ఉక్రెయిన్‌కి సాయం చేయడానికి నాటో నిరాకరించింది. సభ్యదేశాలు విడిగా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్‌ తదితర ఆయుధాలు, ఔషధాలు ఇచ్చేందుకు అంగీకరించాయి.

కూటమిలో ఏ దేశం ఎలాంటి సాయం చేయనుందనే వివరాలు తెలిపేందుకు సెక్రటరీ జనరల్‌ స్టోల్టెన్‌బర్గ్‌ నిరాకరించారు. ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాలు అందిస్తామని, అక్కడ యుద్ధం కొత్త దశకు చేరుతోందని బిట్రన్‌ వ్యాఖ్యానించింది. అంతకుముందు రష్యా దాడిని ఎదుర్కొనేందుకు తమకు ఆయుధ సహకారం అందించాలని పాశ్చాత్య దేశాలను, నాటోను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా కోరారు. నాటో విదేశాంగ మంత్రులతో చర్చలకు ఆయన బ్రసెల్స్‌ వచ్చారు. ఆయుధాలందిస్తే రష్యా తదుపరి లక్ష్యంగా మారతామని నాటో దేశాల్లో కొన్ని భయపడుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్‌కు అనేక ఆయుధాలను అందించాయి.

అయితే విమానాలు, ట్యాంకుల్లాంటి ఆయుధాలను ఇవ్వలేదు. తమకు మిస్సైల్స్, సాయుధవాహనాలు, డిఫెన్స్‌ సిస్టమ్స్‌ కావాలని కులెబా కోరుతున్నారు. జర్మనీ లాంటి దేశాలు తమకు మరింత వేగంగా సాయం అందించాలన్నారు. కీవ్, చెర్నిహివ్‌ ప్రాంతాల నుంచి రష్యా 24 వేల మంది సైనికులను ఉపసంహరించుకుందని, వీరిని తూర్పు ప్రాంతంలో యుద్ధానికి సన్నద్ధం చేస్తోందని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. లుహాన్స్‌క్, డొనెట్సెక్‌ ప్రాంతాల్లాగే డోన్బాస్‌లో కూడా కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్‌ నుంచి విడగొట్టాలన్నది పుతిన్‌ యత్నంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. తూర్పు ప్రాంతంపై రష్యా సేనలు దృష్టి పెడుతున్న వేళ అక్కడి నుంచి  త్వరగా వెళ్లిపోవాలని స్థానికులను ఉక్రెయిన్‌ ప్రభుత్వం కోరింది. రష్యాపై ఆంక్షల రూపంలో ఒత్తిడి పెంచుతామని జీ7 దేశాలు ప్రకటించాయి.

హక్కుల మండలి నుంచి రష్యా సస్పెన్షన్‌
మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్‌ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది. ఈ తీర్మానంపై ఐరాస జనరల్‌ అసెంబ్లీలో గురువారం ఓటింగ్‌ జరిగింది. రష్యా సస్పెన్షన్‌కు అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది.  ఐరాస శాశ్వత సభ్యదేశాల్లో ఇంతవరకు ఏ దేశం కూడా ఐరాస అనుబంధ విభాగాల నుంచి సస్పెండ్‌ కాలేదు.

మరిన్ని వార్తలు