Russia-Ukraine War: లుహాన్‌స్క్‌ రష్యా వశం!

4 Jul, 2022 06:17 IST|Sakshi
ఇర్పిన్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ

రష్యాలోని బెల్‌గొరోడ్‌లో పేలుళ్లు

ఉక్రెయిన్‌ పనేనంటున్న రష్యా

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆకస్మిక పర్యటన

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లో డోన్బాస్‌ ప్రాంతంలోని లుహాన్‌స్క్‌ ప్రావిన్స్‌ రష్యా వశమైనట్టు సమాచారం. అక్కడి చివరి ముఖ్య నగరం లీసిచాన్‌స్క్‌ను ఆక్రమించినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ ఆదివారం ప్రకటించారు. దీనివల్ల డోన్బాస్‌లో జెండా పాతాలన్న లక్ష్యానికి రష్యా చేరువగా వచ్చినట్లయ్యింది. అక్కడి ప్రధాని నగరం సెవెరోడొనెటెస్క్‌ను రష్యా సేనలు ఇటీవలే స్వాధీనం చేసుకున్నాయి.  లీసిచాన్‌స్క్‌లో ఉక్రెయిన్‌ హోరాహోరీగా పోరాడినా లాభం లేకపోయింది.

లీసిచాన్‌స్క్‌ సిటీ నిజంగా రష్యా ఆధీనంలో వెళ్లిందా, లేదా అనేదానిపై ఉక్రెయిన్‌ అధికారులు ఇంకా స్పందించలేదు. అయితే, లుహాన్‌స్క్‌పై రష్యా జవాన్లు భీకర స్థాయిలో విరుచుకుపడుతున్నట్లు ఆదివారం ఉదయం లుహాన్‌స్క్‌ గవర్నర్‌ సెర్హియి హైడై వెల్లడించారు. ఉక్రెయిన్‌ ప్రతిదాడుల్లో రష్యా సైన్యానికి భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపారు. అయినప్పటికీ రష్యా సేనలు మున్ముందుకు దూసుకొస్తున్నాయని పేర్కొన్నారు.

లీసిచాన్‌స్క్‌ ఆక్రమణతో ఇక డోంటెస్క్‌ ప్రావిన్స్‌లోకి అడుగు పెట్టడం రష్యాకు సులభతరంగా మారనుంది. మరోవైపు స్లొవ్యాన్‌స్క్‌లో రష్యా వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో జనం మరణించారని స్థానిక మేయర్‌ ప్రకటించారు. ఇక మెలిటోపోల్‌లో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఉక్రెయిన్‌ దాడుల్లో రష్యాకు చెందిన ఒక సైనిక స్థావరం ధ్వంసమయ్యింది.

రష్యా భూభాగంలో ఉక్రెయిన్‌ దాడులు  
మరోవైపు ఉక్రెయిన్‌ సైన్యం రష్యా భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. పశ్చిమ రష్యాలో ఆదివారం ఉక్రెయిన్‌ క్షిపణి దాడుల్లో నలుగురు మృతిచెందారు. కుర్‌స్క్‌లో రెండు ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేశామని రష్యా పేర్కొంది. సరిహద్దులోని టెట్కినో పట్టణంలో ఉక్రెయిన్‌ జవాన్లు మోర్టార్లతో దాడికి దిగారు. బెలారస్‌లోనూ ఉక్రెయిన్‌ వైమానిక దాడులు సాగించింది. రష్యాలోని బెల్‌గరోడ్‌ నగరంలో భారీ ఎత్తున జరిగిన బాంబు దాడుల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ముగ్గురు మరణించారు. ఇది ఉక్రెయిన్‌ పనేనని రష్యా ఆరోపించింది.

ఉక్రెయిన్‌లో ఆస్ట్రేలియా ప్రధాని పర్యటన  
ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న పట్టణాలను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బేనీస్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌ రష్యా దారుణమైన అకృత్యాలకు తగిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు