Russia-Ukraine war: ఉక్రెయిన్‌ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు

25 Apr, 2022 04:50 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు గడిచిపోయాయి. ఆరు రోజుల్లో ముగుస్తుందని పుతిన్‌ అనుకున్న యుద్ధం కాస్తా 60 రోజులైనా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అంతేగాక రష్యాకు కనీవినీ ఎరగని స్థాయిలో నష్టాలు కలిగించింది. అగ్రరాజ్యం అమెరికా పుష్కలంగా అందిస్తున్న అండదండలే ఇందుకు చాలావరకు కారణం.

అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగకున్నా ఉక్రెయిన్‌కు భారీగా సాయుధ సాయం చేస్తోంది. ప్రధానంగా యూఎస్‌ నుంచి వస్తున్న ఆయుధాలతోనే రష్యా దాడులను ఉక్రెయిన్‌ దీటుగా తిప్పికొడుతూ వస్తోంది. ఈ రెండు నెలల్లో ఉక్రెయిన్‌కు అమెరికా ఏకంగా 340 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేసింది. ఎనిమిదో విడత సాయంగా తాజాగా మరో 80 లక్షల డాలర్ల ఆర్థిక సాయం కూడా అందించింది. వాటికి తోడు ఇంకా భారీగా ఆయుధాలను పంపుతోంది.

► రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్‌ సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అమెరికా పంపిన జావెలిన్‌ క్షిపణులు. సులువుగా భుజం మీద మోసుకెళ్లగలిగే ఈ పోర్టబుల్‌ క్షిపణుల సాయంతో పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించవచ్చు. ఉక్రెయిన్‌కు అమెరికా ఇప్పటిదాకా ఏకంగా 6,000 జావెలిన్‌ యాంటీ ట్యాంక్‌ మిస్సైళ్లను సరఫరా చేసింది. ఇవే రష్యా సైన్యానికి పెను సవాలుగా మారాయి.
► 1,44,000 రౌండ్లను కాల్చే సామర్థ్యమున్న డజన్ల కొద్దీ అత్యాధునిక శతఘ్నులను కూడా అమెరికా అందజేసింది.
► అఫ్గానిస్తాన్‌ యుద్ధంలో వాడిన మరెన్నో అత్యాధునిక రైఫిల్స్, 3 వేలకుపైగా బాడీ ఆర్మర్‌ సెట్స్, హెలికాఫ్టర్లు, రాడార్‌ వ్యవస్థలు, సాయుధ వాహనాలను కూడా భారీగా పంపింది.
► వందల సంఖ్యలో 200 ఎం113 సాయుధ వాహనాలను సమకూర్చింది. 90 శతఘ్ని విధ్వంసక వ్యవస్థలను కూడా ఇచ్చింది. దాంతో ఉక్రెయిన్‌కు రష్యా హెలికాప్టర్లను కూల్చే సామర్థ్యం సమకూరింది.
► రష్యా శతఘ్నల్ని ఎదుర్కోనేలా 10 రాడార్‌ వ్యవస్థలను కూడా పంపింది.
► అత్యాధునిక ఎంఐ–17 హెలికాప్టర్లను పంపేందుకు కూడా అమెరికా సన్నాహాలు చేస్తోంది.
► 4 కోట్ల రౌండ్ల చిన్న మారణాయుధాలు, భారీగా అత్యాధునిక రైఫిల్స్, పిస్టల్స్, మిషన్‌ గన్లు, షాట్‌ గన్స్, 10 లక్షలకు పైగా గ్రెనేడ్లు ఈ 2 నెలల్లో యూఎస్‌ నుంచి అందాయి.
► తూర్పున డోన్బాస్‌లో రష్యా దాడుల్ని ముమ్మరం చేస్తూండటంతో ఉక్రెయిన్‌ అవసరాలకు తగ్గట్టుగా అమెరికా వాయుసేన ప్రత్యేకంగా తయారు చేసిన 121 డ్రోన్లను తాజాగా పంపినట్టుగా పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ తెలిపారు. వీటి వాడకంలో శిక్షణ ఇవ్వడానికి డా ఒక బృందం ఉక్రెయిన్‌కి వెళ్తోంది కూడా. మరో 300 స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లు కూడా ఇప్పటికే కీవ్‌ చేరుకున్నాయి. మరిన్ని డ్రోన్లు పంపేందుకు కూడా యూఎస్‌ సిద్ధమవుతోంది.

 
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

మరిన్ని వార్తలు