Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం

4 Apr, 2022 06:33 IST|Sakshi
బుచా ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్‌ సైనికులను చూసి భావోద్వేగంతో వారిని ఆలింగనం చేసుకున్న ఓ వృద్ధురాలు

ఆయిల్‌ రిఫైనరీ, చమురు డిపోలు, ఆయుధాగారాలు ధ్వంసం

నగరాలపై రష్యా వైమానిక దాడులు

బుచాలో 300 మంది మృతి: మేయర్‌ 

తూర్పు ప్రాంతంలో మోహరింపు

బుచా/కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడెసా సమీపంలో ఆదివారం క్షిపణుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్‌ సైన్యం ఉపయోగిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని, మూడు చమురు డిపోలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కోస్తియాన్‌టినివ్కా, ఖ్రేసిచేలో ఆయుధ డిపోలను సైతం ధ్వంసం చేశామని తెలియజేసింది. మారియుపోల్‌ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖర్కీవ్‌పై 20 వైమానిక దాడులు జరిగాయి. బలాక్లియా పట్టణంలో ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సోమవారం మళ్లీ మొదలవనున్నాయి.

బుచాలో దారుణ దృశ్యాలు  
కొన్ని వారాలుగా రష్యా సైన్యం నియంత్రణలో ఉన్న రాజధాని కీవ్‌ ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. కీవ్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా పట్టణం ఇప్పటికే ఉక్రెయిన్‌ అధీనంలోకి వచ్చింది. అక్కడ శవాలు వీధుల్లో చెల్లాచెదురుగా దర్శనమిచ్చాయని మీడియా ప్రతినిధలు చెప్పారు. వాటికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో రష్యా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఉత్తర ఉక్రెయిన్‌ నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించింది.

ఉక్రెయిన్‌లో మందుపాతర్ల బెడద
రష్యా జవాన్లు తమ భూభాగంలో ఎక్కడిక్కడ మందుపాతరలు ఏర్పాటు చేశారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రోడ్లపై, వీధుల్లో, ఇళ్లలో, అఖరికి శవాల లోపలా మందుపాతరలు పె ట్టారన్నారు. మరిన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలివ్వాలని పశ్చిమ దేశాలను కోరారు.

రంజాన్‌పై యుద్ధ ప్రభావం
యుద్ధంతో చమురు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినందున ఈసారి రంజాన్‌ జరుపుకోవడం కష్టమేనని లెబనాన్, ఇరాక్, సిరియా, సూడాన్, యెమెన్‌ తదితర దేశాల్లో జనం వాపోతున్నారు. వాటికి గోధుమలు, బార్లీ గింజలు, నూనె గింజలు రష్యా, ఉక్రెయిన్‌ నుంచే వెళ్తాయి. లిథువేనియాకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు రావిసియస్‌ మారియుపోల్‌లో కాల్పుల్లో మృతి చెందారు.

రష్యా సైన్యంలో తిరుగుబాటు!
సుదీర్ఘ యుద్ధంతో ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు నీరసించిపోతున్నట్లు చెప్తున్నారు. ముందుకెళ్లడానికి వారు ససేమిరా అంటున్నారు. సొంత వాహనాలు, ఆయుధాలనూ ధ్వంసం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్కచేయడం లేదు. సైనికుల్లో తిరుగుబాటు మొదలైందని, పుతిన్‌ మొండిపట్టుపై వారు రగిలిపోతున్నారని ఉక్రెయిన్‌ అంటోంది. ‘‘సహచరుల మరణాలు రష్యా సైనికులను కలచివేస్తున్నాయి. స్థైర్యం సన్నగిల్లి ఆస్త్ర సన్యాసం చేస్తున్నారు’’ అరని నాటో కూటమి అంటోంది.  యుద్ధానికి రష్యా సైన్యం విముఖత వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 1905 జూన్‌లో రూసో–జపనీస్‌ యుద్ధంలోనూ వారు ఇలాగే సహాయ నిరాకరణ చేశారు. ఉన్నతాధికారులపై తిరగబడ్డారు. వారి ఆదేశాలను ధక్కిరించారు.

మరిన్ని వార్తలు