Russia-Ukraine war: క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

11 Feb, 2023 05:58 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులు తీవ్రతరం చేసింది. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్‌బాస్‌పై గురి పెట్టింది. లుహాన్‌స్క్, డొనెట్‌స్క్‌ ప్రావిన్స్‌లతోపాటు రాజధాని కీవ్, లీవ్‌పైనా క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు తెలిపాయి. ‘‘గురువారం సాయంత్రం నుంచి 71 క్రూయిజ్‌ క్షిపణులను, 35 ఎస్‌–300 క్షిపణులను, 7 షహెడ్‌ డ్రోన్లను ప్రయోగించారు. 61 క్రూయిజ్‌ మిస్సైళ్లు, 5 డ్రోన్లను కూల్చేశాం’’ అని చెప్పింది. విద్యుత్‌ వ్యవస్థలపై దాడులతో కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది.

ఖర్కీవ్‌లో క్షిపణి దాడిలో ఏడుగురు గాయపడినట్లు అధికారులు చెప్పారు. జపొరిజియాపై గంట వ్యవధిలోనే 17సార్లు క్షిపణి దాడులు జరిగాయి. ఐదు క్షిపణులను, 5 షాహెద్‌ కిల్లర్‌ డ్రోన్లను కూల్చివేశామన్నారు. రష్యా క్షిపణులు రెండు రొమేనియా, మాల్దోవా గగనతలంలోకి వెళ్లినట్లు ఉక్రెయిన్‌ సైనిక జనరల్‌ ఒకరు చెప్పారు. నిరసనగా మాల్దోవా తమ దేశంలోని రష్యా రాయబారికి సమన్లు పంపింది. డొనెట్‌స్క్‌లో రష్యా అదనంగా బలగాలను రంగంలోకి దించింది. లుహాన్‌స్క్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు రష్యా ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

మరిన్ని వార్తలు