Russia-Ukraine War: ఆగని దమనకాండ.. రైల్వే స్టేషన్‌పై రష్యా దాడి

9 Apr, 2022 04:47 IST|Sakshi
క్రామటోర్స్‌క్‌ రైల్వే స్టే్టషన్‌పై రష్యన్‌ సేనలు బాంబు దాడి చేసిన దృశ్యం; ప్రయాణికుల లగేజీ, చిన్నారిని తోసుకెళ్లే క్రెష్, తుపాకీ, రక్తపు మరకలతో భీతావహంగా స్టేషన్‌

39 మందికి పైగా మృతి చెందారన్న ఉక్రెయిన్‌

వందలమందికి గాయాలు

రష్యావి క్రూర నేరాలని జెలెన్‌స్కీ ఆరోపణ

చెర్నిహివ్‌: ఉక్రెయిన్‌లో పౌరులను తరలిస్తున్న ఒక రైల్వే స్టేషన్‌పై రష్యా జరిపిన రాకెట్‌ దాడిలో 39 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక గవర్నర్‌ పావ్‌లోవ్‌ కిరిలెంకో శుక్రవారం ప్రకటించారు. రష్యన్‌ సేనలు తూర్పు ఉక్రెయిన్‌ వైపుగా వెళుతూ ఖాళీ చేస్తున్న నగరాల్లో మరిన్ని దారుణాలు కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు. డొనెట్స్‌క్‌ ప్రాంతంలోని క్రామటోర్స్‌క్‌ స్టేషన్‌లో వేలాది మంది ప్రజలు ఉన్నారని, ఆ స్టేషన్‌పై మిసైల్‌ దాడి జరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ధ్వంసమైన రైల్‌ బోగీల దృశ్యాలను ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దాడిలో వందమందికి పైగా గాయపడి ఉండొచ్చని అంచనా.

యుద్ధంలో తమను గెలవలేక రష్యా ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడుతోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. మారియుపోల్‌లో ఘోరాలు బయటపడితే రష్యా అకృత్యాలు మరింతగా తెలియవస్తాయన్నారు. రష్యా సైనికులు ఖాళీ చేసిన బుచా తదితర నగరాల్లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూస్తోందని, రష్యా క్రూర నేరాలకు పాల్పడుతోందని చెప్పారు. బుచాకు దగ్గరలోని బొరొడైంకా నగరంలో మరింతమంది మృతులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రష్యా అమానవీయంగా వ్యవహరిస్తోందన్న కారణంగా ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేసేందుకు నాటో దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే! అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని రష్యా పేర్కొంది.

ఎదురుదెబ్బలు నిజమే
ఉక్రెయిన్‌పై దాడిలో తమకు భారీగా నష్టం వాటిల్లినట్లు రష్యా అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్‌ చెప్పారు. ఆపరేషన్‌ వీలైనంత తొందరగా ముగించేందుకు రష్యా సేనలు యత్నిస్తున్నాయని, తమ దాడి త్వరలో ముగుస్తుందని స్కైన్యూస్‌తో చెప్పారు. భారీగా సైనికులను నష్టపోవడం బాధాకరమన్నారు. రష్యా దాడితో ఉక్రెయిన్‌ నుంచి దాదాపు 65 లక్షల మంది నిరాశ్రయులయి ఉంటారని ఐరాస అంచనా వేసింది. ఐరాస మానవహక్కుల సంఘ అంచనాల ప్రకారం 43 లక్షలమంది శరణార్ధులయ్యారు. వీరిలో సగం మంది పిల్లలని అంచనా. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో ఇంకా 1.2 కోట్లమంది చిక్కుకుపోయి ఉంటారని ఐఓఎం అంచనా వేసింది.

ఈ వారంలో కాల్పుల విరమణ కుదురుతుందన్న ఆశలేదని ఐరాస ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత మద్దతునందించేందుకు ఇద్దరు ఈయూ అధికారులు, స్లోవేకియా ప్రధాని కీవ్‌కు చేరారు.  అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఆహార ధరలు భారీగా పెరుగుతున్నాయని ఐరాస అనుబంధ సంస్థ తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే పప్రంచ ఆహారధాన్యాల ధరల సూచీ మార్చిలో 12.6 శాతం పెరిగి 159.3 పాయింట్లకు చేరిందని తెలిపింది. రష్యా సేనలు వైదొలిగిన సుమి నగరంలో ప్రజలు అపమ్రత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్‌ సూచించారు. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంపై రష్యా దృష్టి సారిస్తోందని బ్రిటన్‌ రక్షణ మంత్రి అంచనా వేశారు. దేశ రక్షణకు విఘాతం కలిగిస్తున్నారంటూ 15 మంది రష్యన్లను డెన్మార్క్‌ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. రష్యాకు చెందిన అతిపెద్ద మిలటరీ షిప్‌ బిల్డింగ్, డైమండ్‌ మైనింగ్‌ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.

అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రయాణికులు

మరిన్ని వార్తలు