Russia-Ukraine War: కొనసాగుతున్న దాడులు

13 Oct, 2022 05:19 IST|Sakshi
ఇజియంలో ఆహారం, నిత్యావసర çసరుకుల కోసం ఎగబడుతున్న స్థానికులు

అవిడ్వికా మార్కెట్‌పై దాడుల్లో ఏడుగురు మృతి

యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా అండగా ఉంటామన్న నాటో

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల పరంపర కొనసాగుతోంది. నేరుగా జనావాసాలను లక్ష్యంగా చేసుకొని రష్యా మిలటరీ దాడులు చేస్తోంది. అవిడ్వికా, నిక్‌పోల్, జపోరిజియా నగరాలపై ఎస్‌–300 క్షిపణులతో దాడి చేస్తోంది. అవిడ్వికా మార్కెట్‌పై జరిగిన క్షిపణి దాడిలో ఏడుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా, యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని నాటో స్పష్టం చేసింది. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో 50 దేశాల సమావేశాం అనంతరం కూటమి చీఫ్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మీడియాతో మాట్లాడారు.

ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థను అందించడానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని స్టోలెన్‌బర్గ్‌ స్పష్టంచేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడికి దిగుతుందని తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అభిప్రాయపడ్డారు. అయితే అణు దాడికైనా వెనుకాడమని రష్యా అధినేత హెచ్చరించడం ఆయన బాధ్యతరాహిత్యాన్ని బయటపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌ మిలటరీ సామర్థ్యాన్ని, పశ్చిమ దేశాల అండను పుతిన్‌ తక్కువగా అంచనా వేశారని వ్యాఖ్యానించారు. మరోవైపు కెర్చ్‌ వంతెన పేలుడుకు సంబంధించి ఐదుగురు రష్యన్లు, ముగ్గురు ఉక్రెనియన్లను రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ అరెస్ట్‌ చేసింది.
 

మరిన్ని వార్తలు