Russia-Ukraine War: పుతిన్‌ ‘తప్పు’టడుగులు

18 Sep, 2022 05:27 IST|Sakshi

ఉక్రెయిన్‌పై దండయాత్ర రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చారిత్రక తప్పిదమా ? ముందు వెనుక ఆలోచించకుండా యుద్ధానికి దిగి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? రష్యా సైన్యానికి వరస ఎదురు దెబ్బలు దేనికి సంకేతం ? 200 రోజులు దాటినా ఉక్రెయిన్‌పై పట్టు కోసం ఇంకా ఆపసోపాలు పడటానికి కారణాలేంటి ?

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడు నెలలు కావస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్‌ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం మరింత పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటే, అపారమైన నష్టాన్ని చవి చూసిన రష్యా ఒకరకమైన గందరగోళంలో ఉంది. ఇటీవల ఖర్కీవ్‌లో ఉక్రెయిన్‌ సేన చేతిలో రష్యా ఓటమి ఆ దేశానికి గట్టి ఎదురు దెబ్బగా మారింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా రష్యా ఇప్పట్లో యుద్ధానికి ముగింపు పలుకుందని భావించలేం.

ఉక్రెయిన్‌లో మిలటరీ ఆపరేషన్‌ కొనసాగుతుందని పుతిన్‌ ప్రెస్‌ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్‌ ఇటీవలే స్పష్టం చేశారు. తూర్పు డోన్బాస్‌ స్వాధీనమే తమ ముందున్న లక్ష్యమని, దాని సాధనకు తొందరేమీ లేదని తాజాగా షాంఘై సహకార సదస్సు సందర్భంగా పుతిన్‌ కూడా అన్నారు. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కానీ యుద్ధంలో రష్యా ఆత్మరక్షణలో పడిపోవడానికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.  

ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాల అండ
అమెరికా సహా నాటో దేశాలన్నీ కలసికట్టుగా ఉక్రెయిన్‌కు ఇంతగా అండగా ఉంటాయని పుతిన్‌ ఊహించలేకపోయారు. యుద్ధం ఎన్నాళ్లు సాగినా సాయం కొనసాగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. హిమార్స్‌ రాకెట్‌ వ్యవస్థతోనే ఉక్రెయిన్‌ సేనలు వందలాది రష్యన్‌ స్థావరాలను ధ్వంసం చేశారు. హౌటైజర్స్, స్విచ్‌బ్లేడ్‌ డ్రోన్లు, రాకెట్‌ లాంచర్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్‌ సిస్టమ్స్‌ ఉక్రెయిన్‌ దగ్గర ఉన్నాయి.  అమెరికా తాజాగా  1500 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. దీంతో రష్యా పరోక్షంగా పశ్చిమ దేశాలతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది.

ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి
ఉక్రెయిన్‌పై దాడులకి దిగితే అమెరికా, యూరప్‌ దేశాలు ఆంక్షలు విధించినా చమురు, గ్యాస్‌ కోసం తమపై ఆధారపడతాయని త్వరలోనే ఆంక్షలకి ముగింపు పలుకుతాయని పుతిన్‌ తప్పుగా అంచనా వేశారు. ఫిబ్రవరి నుంచి రష్యాపై 9,200కిపైగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వెయ్యికి పైగా మల్టీ నేషనల్‌ కంపెనీలు రష్యాను వీడాయి. ఆయుధాల ఉత్పత్తీ మందగించింది. దాంతో ఉత్తర కొరియా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలుకు సిద్ధపడాల్సి వచ్చింది! రష్యాను ఆర్థికంగా  చమురు, గ్యాస్‌ ఎగుమతులు మాత్రమే ఆదుకుంటున్నాయి.  

పుతిన్‌ మితిమీరిన ఆత్మవిశ్వాసం
యుద్ధం చిటికెలో ముగుస్తుందనే భావనతో రంగంలోకి దిగిన పుతిన్‌కు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధాన్ని ముగిస్తే మంచిదన్న భావన రష్యాలో వివిధ వర్గాల్లో పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం, అసహనం ఒకే నాణేనికి చెరోవైపు ఉంటాయన్న వాస్తవాన్ని పుతిన్‌ గ్రహించుకోలేకపోయారని బ్లూమ్‌బర్గ్‌ కాలమిస్ట్‌ లియోనిడ్‌ బెర్షిడ్‌స్కీ అన్నారు.

కదనరంగంలో కిరాయి సైనికులు  
ఉక్రెయిన్‌లో కిరాయి సైనికుల్ని దింపడం పుతిన్‌ చేసిన మరో పెద్ద తప్పిదమంటున్నారు. వాగ్నర్‌ సంస్థతో పాటు పశ్చిమాసియా దేశాలకు చెందిన వారిని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకున్నారు. రష్యా ఇలాంటివారిపై ఆధారపడగా, ఉక్రెయిన్‌ సైనికులు మాత్రం తమ దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో స్వచ్ఛందంగా యుద్ధరంగంలోకి దిగారు. కాంట్రాక్ట్‌ సైనికులకి తక్కువ జీతాలు ఇస్తూ ఉండడంతో వారు పూర్తి స్థాయిలో పోరాటపటిమను ప్రదర్శించడం లేదు. తమకు పరిచయం లేని భూభాగంలోకి వచ్చి పోరాడుతున్న రష్యా సైనికులు త్వరగా నిస్సత్తువకి లోనవుతూ ఉంటే, సొంతగడ్డపై స్థానికబలంతో పోరాడే ఉక్రెయిన్‌ సేనలు నిత్యం ఉత్సాహంగా ఉంటున్నాయి. దీంతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఇప్పటివరకు ఉక్రెయిన్‌  2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది.  

వ్యూహాత్మక తప్పిదాలు  
యుద్ధంలో రష్యా పలు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఏప్రిల్‌లో కీవ్, ఉత్తర ప్రాంతంలో ఉక్రెయిన్‌ ప్రతిఘటన ధాటికి రష్యా సేనలు వెనుదిరిగాయి. ఆ సమయంలో బలగాలను డోన్బాస్‌పైకి పంపడం వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వినబడుతోంది. ఇలా చేయడం వల్ల చిత్తశుద్ధితో రష్యా తరఫున పోరాడే సైనికుల్ని త్వరితగతిన దేశం కోల్పోయింది. ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా సైనికుల్లో అంకితభావం కనిపించడం లేదు. ఎంత త్వరగా వెనక్కి వెళ్లి కుటుంబాలతో కలిసి గడుపుతామని వారు ఎదురు చూస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు