Russia-Ukraine war: ముట్టడిలో నగరాలు

30 May, 2022 04:10 IST|Sakshi
సైనికురాలిని సాహస పురస్కారంతో సత్కరిస్తున్న జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌లో రెచ్చిపోతున్న రష్యా

పోక్‌రోవ్స్‌క్‌ (ఉక్రెయిన్‌): ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పున డోన్బాస్‌లో పలు నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడింది. తయరీ పరిశ్రమకు కేంద్రమైన సెవెరోడోనెట్స్‌క్‌ నగరం బాంబులు, క్షిపణుల మోతతో దద్దరిల్లింది. సమీపంలోని లిసిచాన్స్‌క్‌ తదితర నగరాలపైనా దాడులు తీవ్రతరమయ్యాయి. డోన్బాస్‌లో కీలక కేంద్రాలైన ఈ రెండు నగరాలను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌ దళాలు పలుచోట్ల వాటితో హోరాహోరీ తలపడుతున్నాయి.

డోన్బాస్‌ చాలావరకు రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉండగా ఈ రెండు నగరాలూ ఉక్రెయిన్‌ అధీనంలో ఉన్నాయి. అక్కడి సైనిక లక్ష్యాలపై జరిగిన దాడుల్లో పలువురు పౌరులు కూడా బలయ్యారు. పౌర సేవలన్నీ స్తంభించిపోయాయి. సెవెరోలో ఇప్పటికే కనీసం 1500 మందికి పైగా మరణించినట్టు ఉక్రెయిన్‌ చెబుతోంది. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బాబ్రోవ్‌ గ్రామం వద్ద జరిగిన పోరులో రష్యా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం.

చాలామంది సైనికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు అవుతున్నట్టు చెబుతున్నారు. లుహాన్స్‌క్‌ ప్రాంతంలోని బక్‌ముట్‌ నగరంపైనా శనివారం రాత్రి నుంచి దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తరాన రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌తో పాటు , సమీ తదితర ప్రాంతాల్లో ఎయిర్‌ స్ట్రైక్స్‌ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి దాడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఉక్రెయిన్‌ చెబుతోంది.  ఈయూ ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యాతో సెర్బియా మూడేళ్ల గ్యాస్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశం ఇంధన అవసరాల కోసం దాదాపుగా రష్యా మీదే ఆధారపడింది.

మరిన్ని వార్తలు