Russia-Ukraine war: పుతిన్‌పై హత్యాయత్నం

4 May, 2023 05:21 IST|Sakshi
క్రెమ్లిన్‌ భవనంపై డ్రోన్‌ను పేల్చేస్తున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో సర్కిల్లో) పేల్చివేతకు క్షణాల ముందు డ్రోన్‌

క్రెమ్లిన్‌పై డ్రోన్‌ దాడులు: రష్యా

ఉక్రెయిన్‌ పనేనని తీవ్ర ఆరోపణ

భారీ మూల్యం తప్పదని హెచ్చరిక

అధ్యక్షుడు క్షేమమని వెల్లడి

తమకు సంబంధం లేదన్న ఉక్రెయిన్‌

కీవ్‌పై డ్రోన్లు, బాంబుల వర్షం

కీవ్‌: అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. అందులో భాగంగా బుధవారం తెల్లవారజామున అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్‌ దాడులు జరిగాయని ప్రకటించింది. ఇది మతిమాలిన ఉగ్రవాద చర్య అంటూ మండిపడింది. ఇందుకు తీవ్రస్థాయిలో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. భారీ స్థాయిలో  ప్రతి దాడి ఉంటుందని ప్రకటించింది. సరైన సమయంలో దీటుగా స్పందిస్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది.

ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామన్నదే వాటి అంతరార్థమని భావిస్తున్నారు. ‘‘దాడులను భగ్నం చేశాం. మా భద్రతా దళాలు డ్రోన్లలో మధ్యలోనే పేల్చేశాయి. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. క్రెమ్లిన్‌ భవనానికీ నష్టం జరగలేదు. ఆ సమయంలో పుతిన్‌ క్రెమ్లిన్‌లో లేరు. మాస్కో ఆవల నోవో ఒగర్యోవో నివాసంలో సురక్షితంగా ఉన్నారు’’ అని ఆయన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తెలిపారు. మే 9న నగరంలో జరగాల్సిన విక్టరీ డే పరేడ్‌ను అడ్డుకోవడం కూడా దాడి లక్ష్యమని ఆరోపించారు. పరేడ్‌ యథాతథంగా జరుగుతుందని ప్రకటించారు.

దాడిపై అనుమానాలు
క్రెమ్లిన్‌పై డ్రోన్‌ దాడులు జరిగినట్టు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. రష్యా కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి రుజువులూ బయట పెట్టలేదు. దాడి జరిగితే ఆ విషయాన్ని 12 గంటల పాటు ఎందుకు దాచారన్న దానిపైనా వివరణ లేదు. క్రెమ్లిన్‌పై డ్రోన్‌ దాడిగా చెబుతున్న వీడియోలు మాత్రం వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మాస్కోలో డ్రోన్లపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది.

క్రెమ్లిన్‌పై జరిగినట్టు చెబుతున్న డ్రోన్‌ దాడులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. తమపై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు బహుశా ఈ ఉదంతాన్ని సాకుగా రష్యా వాడుకోవచ్చని అభిప్రాయపడింది. తమ నగరాలపై జరుపుతున్న తీవ్ర స్థాయి సైనిక దాడులను ఇలా సమర్థించుకోజూస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్‌తో రష్యా 14 నెలలుగా పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ దాడులను ఉక్రెయిన్‌ దీటుగా తిప్పికొడుతూ వస్తోంది.

ఏం జరిగింది?
దాడికి సంబంధించి పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒకదాంట్లో క్రెమ్లిన్‌పైకి డ్రోన్‌ దూసుకొస్తూ కన్పించింది. అతి సమీపానికి వచ్చాక పేలిపోయి నేలకూలింది. క్రెమ్లిన్, సమీప భవనాల మీదుగా పొగ వస్తున్న వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. దాడికి సంబంధించి క్రెమ్లిన్‌ పక్కనున్న నది ఆవల నుంచి తీసినట్టు చెబుతున్న వీడియో మాస్కో స్థానిక టెలిగ్రా చానల్లో రాత్రి పూట ప్రసారమైంది.డ్రోన్‌ శకలాలు అధికార భవన ఆవరణలో పడ్డట్టు క్రెమ్లిన్‌ వెబ్‌సైట్‌ కూడా పేర్కొంది. తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో భారీ శబ్దాలు, పొగ వచ్చినట్టు స్థానికులు చెప్పుకొచ్చారు. దీనిపై రష్యాలో ప్రభుత్వ అనుకూల వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం ప్రతి దాడులకు దిగి ఉక్రెయిన్‌ సీనియర్‌ నాయకులను వరుసబెట్టి అంతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

జెలెన్‌స్కీ ‘నిర్ణాయక దాడి’ వ్యాఖ్యల నేపథ్యంలో ఘటన
► ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ తాజాగా ఫిన్లండ్‌లో ఆకస్మికంగా పర్యటించారు.
► రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని శక్తిమంతమైన ఆయుధాలు అందజేయాలని ఐదు నోర్డిక్‌ దేశాలు ఫిన్లండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్‌లను గట్టిగా కోరారు.
► ఈ సందర్భంగా హెల్సింకీలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌ అతి త్వరలో ప్రతిదాడికి దిగనుందని ప్రకటించారు.
► ‘‘విజయం కోసం నిర్ణాయక దాడి చేయనున్నాం’’ అని చెప్పు కొచ్చారు. తర్వాత కాసేపటికే రష్యా నుంచి డ్రోన్‌ దాడి ఆరోపణ వెలువడింది.
► మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. రాజధాని కీవ్‌పై ఇరాన్‌ తయారీ డ్రోన్లతో రష్యా సైన్యం దాడులకు పాల్పడింది.
► 21 డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు దక్షిణ రష్యాలో క్రాస్నోడర్‌ ప్రాంతంలో ఓ చమురు డిపోలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
► ఇది రష్యా సరఫరా వ్యవస్థలను లక్ష్యం చేసుకుని కొంతకాలంగా ఉక్రెయిన్‌ చేస్తు న్న దాడుల్లో భాగమేనని భావిస్తున్నారు.  
► ఇది రష్యా సరఫరా వ్యవస్థలను లక్ష్యం చేసుకుని కొంతకాలంగా ఉక్రెయిన్‌ చేస్తు న్న దాడుల్లో భాగమేనని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు