Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై ‘అణు’ ఖడ్గం!

20 Mar, 2022 04:30 IST|Sakshi

రష్యా ఎత్తుగడలపై సర్వత్రా ఆందోళన

ఇప్పటికే హైపర్‌సోనిక్‌ క్షిపణి సహా పలు ప్రమాదకర ఆయుధాల ప్రయోగం

అణు ముప్పును తప్పించేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్న అమెరికా

ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి 25 రోజులు గడుస్తున్నా రష్యా పెద్దగా సాధించిందేమీ కన్పించడం లేదు. అమ్ములపొదిలో ఆయుధాలు ఖాళీ అయిపోతున్నాయి. రష్యా సైనికుల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అంతర్జాతీయ ఆంక్షల చట్రంలో ఇరుక్కొని దేశం నలిగిపోతోంది. అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధోన్మాదంపై స్వదేశంలోనే తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఆయన ఓవైపు రాజీమార్గాలను అన్వేషిస్తూనే మరోవైపు దాడులను తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా హైపర్‌ సోనిక్‌ క్షిపణిని ప్రయోగించిన రష్యా, మున్ముందు అణు దాడులకూ పాల్పడుతుందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి...

రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ఎటూ పాలుపోకపోవడంతో పుతిన్‌ అసహనంతో రగిలిపోతున్న మాట నిజమేనని స్లేట్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ జాతీయ భద్రతా వ్యవహారాల ప్రతినిధి ఫ్రెడ్‌ కప్లన్‌ అన్నారు. ‘‘ది బాంబ్‌: ప్రెసిడెంట్స్, జనరల్స్, అండ్‌ ది సీక్రెట్‌ హిస్టరీ ఆఫ్‌ న్యూక్లియర్‌ వార్‌’’ రచయిత అయిన ఆయన రష్యా అణు యుద్ధ భయాలపై లోతైన విశ్లేషణ చేశారు.

‘ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఓటమి అంచుల్లో ఉంది. అంతమాత్రాన పుతిన్‌ అణ్వాయుధాలు ప్రయోగిస్తారని అనుకోలేం. ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించడానికి నాటో నిరాకరించింది గనుక రష్యా ఆ సాహసం చేయకపోవచ్చు. అమెరికా, నాటో దేశాలు యుద్ధంలోకి నేరుగా ప్రవేశిస్తే అది వేరే సంగతి. వాటిని అడ్డుకోవడానికి రష్యా ఎంతకైనా తెగించవచ్చు. రష్యా, అమెరికా దగ్గర పరస్పరం నామరూపాల్లేకుండా చేసుకోగలిగినన్ని అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి. కానీ వాటిని ప్రయోగించే అవకాశాలు లేవనే చెప్పాలి.

రష్యా చిన్న అణు బాంబుల్ని  ప్రయోగించినా కనీసం 8 వేల టన్నుల రేడియేషన్‌ వెలువడి ఊహాతీతమైన విధ్వంసం జరుగుతుంది. అదీగాక అణ్వాయుధాలను వాడే దేశంపై అంతర్జాతీయంగా ఆంక్షలు మరింతగా పెరుగుతాయి. అందుకే 1945 తర్వాత ఏ దేశమూ ఆ సాహసం చేయలేదు. అయినా ఏ దేశం యుద్ధ వ్యూహం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధానికి దిగనంత వరకూ అణు ముప్పుండకపోవచ్చు. అందుకే ఉక్రెయిన్‌ ఎంత ప్రాధేయపడ్డా నో ఫ్లై జోన్‌ ప్రకటించకుండా అ మెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. పరోక్ష సాయానికే పరిమితమవుతోంది’’ అని అన్నారాయన.
 

చైనా సహకారం లేకుండా...  
రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా లేదా అన్నదాన్ని చైనాతో ముడిపెట్టి చూడాలని బ్లూమ్‌బర్గ్‌ యూరప్‌ రిపోర్టర్‌ మారియో టాడియో అన్నారు. ‘‘చైనా నుంచి రష్యాకు ఆశించిన సైనిక తదితర సహకారం అందడం లేదు. పుతిన్‌ దౌత్య పరిష్కారం కోరుకుంటున్నారు. అణ్వాయుధ ప్రయోగానికి దిగకపోవచ్చు’’ అని అన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన ఆయుధాలు
► కల్బీర్‌ క్రూయిజ్‌ క్షిపణులు: పౌర ప్రాంతాలపై వీటిని విరివిగా ప్రయోగించింది. 2015లో సిరియాలో జరిపిన దాడుల్లోనూ వీటిని వాడింది.
► ఇస్కాండర్‌ క్షిపణులు: 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే వీటిని భారీ భవనాలను నాశనం చేయడానికి ప్రయోగించింది.
► రాకెట్‌ దాడులు: కీవ్‌తో పాటు ఖర్కీవ్, ఒడెశా, చెర్నిహివ్, ఇర్పిన్‌లపై వీటిని భారీగా ప్రయోగిస్తోంది. స్మెర్క్, గ్రాడ్, ఉరకాన్‌ రాకెట్‌ లాంఛర్ల ద్వారా వీటిని ప్రయోగించి ధ్వంసరచన చేస్తోంది.
► శతఘ్నులు: అత్యంత శక్తిమంతమైన 203ఎం ఎం పియోని, 152–ఎంఎం హైసింథ్, అకాకియా హొవిట్జర్‌ శతఘ్నులను ప్రయోగిస్తోంది.
► క్లస్టర్, వాక్యూమ్‌ బాంబులు: అత్యంత ప్రమాదకరమైన వీటిని జనసమ్మర్ధ ప్రాంతాలపై విస్తృతంగా ప్రయోగించింది.

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు