Russia-Ukraine War: చర్చలకు చరమగీతం

19 Apr, 2022 04:48 IST|Sakshi
సోమవారం రష్యా వైమానిక దాడిలో ధ్వంసమైన రూబిజిన్‌ పట్టణం

రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలు కష్టమన్న ఉక్రెయిన్‌

మారియుపోల్‌ దాదాపుగా రష్యా హస్తగతమైనట్టే

పలు ఉక్రెయిన్‌ నగరాలపై దాడులు ముమ్మరం

వాషింగ్టన్‌: మారియుపోల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్‌లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అయితే మారియుపోల్‌లో రష్యా విధ్వంసం దరిమిలా ఇకపై ఆ నగరం గతంలోలాగా ఉండకపోవచ్చని వాపోయారు.

ఇటీవల కాలంలో రష్యాతో శాంతి కోసం చర్చలు జరిపామని, కానీ తాజా ఘటనలు చర్చలకు చరమగీతం పాడతాయని హెచ్చరించారు. ప్రస్తుతం మారియుపోల్‌ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ అజోవస్టాల్‌ స్టీల్‌ మిల్‌ ప్రాంతంలో మిగిలిన ఉక్రెయిన్‌ సైనికులు ప్రతిఘటన కొనసాగిస్తున్నారు. వీరంతా ఆయుధాలు వదిలి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా సైన్యం ప్రకటించింది. మారియుపోల్‌లో ఉన్నవారి రక్షణ గురించి బ్రిటన్, స్వీడన్‌ నేతలతో మాట్లాడినట్లు జెలెన్‌స్కీ చెప్పారు. యుద్ధంలో రష్యాకు చెందిన మేజర్‌ జనరల్‌ వ్లాదిమిర్‌ ఫ్రోలోవ్‌ మరణించారు. మారియుపోల్‌లో తుదిదాకా పోరాడతామని ఉక్రెయిన్‌ ప్రధాని షైమ్‌హల్‌ ప్రకటించారు.  

బాంబింగ్‌ ఉధృతి పెరిగింది
మాస్క్‌వా మునక తర్వాత రష్యా తన మిసైల్‌ దాడులను మరింత ముమ్మరం చేసింది. ఖార్కివ్‌ నగరంపై దాడుల్లో ఐదుగురు మరణించారు. రష్యా సేనల దురాగతాలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. తమకు మరిన్ని ఆయుధాలందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్‌వివ్‌ నగరంపై రష్యా జరిపిన మిసైల్‌ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్‌ తెలిపింది. ఇప్పటివరకు ఈ నగరంతో సహా దేశ పశ్చిమభాగంపై రష్యా దాడులు పెద్దగా జరపలేదు.

దీంతో చాలామంది ప్రజలు ఇక్కడ తలదాచుకున్నారు. కానీ తాజాగా ఈ నగరంపై కూడా రష్యా దాడుల ఉధృతి పెరిగింది. నగరంలోని మిలటరీ స్థావరాలు, ఆటోమెకానిక్‌ షాపుపై రష్యా దాడులు జరిపినట్లు నగర మేయర్‌ ఆండ్రీ చెప్పారు. దాడుల్లో ఒక హోటల్‌ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. కీవ్‌కు దక్షిణాన ఉన్న వాసైల్కివ్‌ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ నగరంలో ఒక మిలటరీ బేస్‌ ఉంది. ఉక్రెయిన్‌లోని ఆయుధ స్థావరాలను, రైల్వే తదితర మౌలికసదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకొని దాడులు ముమ్మరం చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అప్పుడు డోన్బాస్‌లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాదన్నది రష్యా ఆలోచనగా చెబుతున్నారు. రష్యా సైతం తాము పలు మిలటరీ టార్గెట్లపై దాడులు జరిపినట్లు ప్రకటించింది. మానవీయ కారిడార్లపై రష్యా దాడి చేస్తున్నందున పౌరుల తరలింపును నిలిపివేశామని ఉక్రెయిన్‌ పేర్కొంది. డోన్బాస్‌ నుంచి పారిపోతున్న నలుగురు పౌరులను రష్యా సేనలు కాల్చిచంపాయని ఆరోపించింది. ఆయా నగరాల నుంచి పౌరుల తరలింపునకు సహకరించాలని రష్యాను కోరింది. కీవ్‌ ముట్టడి విఫలమైన దరిమిలా డోన్బాస్‌పై పట్టుకు రష్యా తీవ్రంగా యత్నిస్తోంది. మారియుపోల్‌ ఆక్రమణ ఈ దిశగా కీలక ముందడుగని నిపుణులు పేర్కొన్నారు. నగరంపై దాడిలో దాదాపు 21వేల మంది చనిపోయిఉంటారని ఉక్రెయిన్‌ తెలిపింది. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్షమంది ప్రజలు ఉన్నట్లు అంచనా.  

సిద్ధమవుతున్న సిరియా ఫైటర్లు
ఉక్రెయిన్‌లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్‌ ఆల్‌ హసన్‌ డివిజన్‌కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా యుద్ధనీతి మారుతుందంటున్నారు. జనరల్‌ అలెగ్జాండర్‌ను ఉక్రెయిన్‌పై యుద్ధ దళపతిగా పుతిన్‌ నియమించిన సంగతి తెలిసిందే! గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. అయితే సిరియా ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది.

మరిన్ని వార్తలు