Russia-Ukraine war: రష్యా విక్టరీ డే: మే 9న ఏం జరగబోతోంది?

8 May, 2022 06:27 IST|Sakshi

రష్యా విక్టరీ డే రోజు పుతిన్‌ వ్యూహరచన ఎలా ఉండబోతోంది?

యుద్ధాన్ని మరింత రాజేస్తారా? ప్రజల్లో దేశభక్తిని ఉసిగొల్పుతారా

మే 9.. రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీలపై సోవియెట్‌ యూనియన్‌ విజయం సాధించిన రోజు. సోవియెట్‌ యూనియన్‌ అధినేత జోసెఫ్‌ స్టాలిన్‌ ముందు 1945 సంవత్సరం, మే9న నాజీలు లొంగిపోయిన రోజు. ప్రతీ ఏడాది అదే రోజు విజయోత్సవ వేడుకలు అంబరాన్ని తాకుతాయి.

రష్యా తన మిలటరీ సత్తా ప్రపంచానికి చాటి చెప్పేలా మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ వద్ద సైనిక పెరేడ్‌ నిర్వహిస్తుంది. కానీ ఈ సారి ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ తేదీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ తేదీన ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక మలుపు తిప్పుతారని,   అధికారంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని దశల వారీగా స్వాధీనం చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.

యుద్ధం కీలక మలుపు తిరుగుతుందా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విజయోత్సవ వేడుకల్ని గత కొద్ది ఏళ్లుగా కొత్త దేశాలపై యుద్ధ ప్రకటనలు చేయడానికే ఉపయోగిస్తున్నారు. గత ఏడాది మే 9న పుతిన్‌ చేసిన ప్రసంగంలో రష్యా శత్రువులందరూ తమ దేశాన్ని చుట్టుముట్టేస్తున్నారని, పశ్చిమ సిద్ధాంతాలను తమపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ఈ ఏడాది కూడా విక్టరీ డే నాడు పుతిన్‌ సంచలన ప్రకటన చేస్తారన్న అంచనాలున్నాయి.

మారియుపోల్‌ నగరాన్ని  స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటనతో పాటుగా  పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అణ్వాయుధాలను ప్రయోగిస్తారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. విజయోత్సవ దిన వేడుకల్ని ఉక్రెయిన్‌ నగరాల్లో కూడా నిర్వహించడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. మారియుపోల్‌ సహా శిథిలావస్థకు చేరుకున్న పలు నగరాలను రష్యా సైన్యం పరిశుభ్రం చేస్తూ ఉండడమే దీనికి తార్కాణమని పేర్కొంటోంది.

పశ్చిమ దేశాల ఆందోళనలు ఎందుకు ?
ఈ ఏడాది విక్టరీ డే రోజు పుతిన్‌ ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించి వారందరితో ఆయుధాలు పట్టించే ప్రమాదం ఉందని పశ్చిమాది దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ దండయాత్రపై రష్యన్లలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చి వారిలో దేశభక్తి రేగేలా పుతిన్‌ ప్రసంగించడానికి సిద్ధమయ్యారని డ్యూక్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, రష్యా వ్యవహారాల్లో నిపుణుడు సైమన్‌ మిల్స్‌ అభిప్రాయపడ్డారు.

‘‘ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ అని చెబుతూ వస్తున్న పుతిన్‌ ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించి సాధారణ రష్యన్లని కూడా యుద్ధోన్ముఖుల్ని చేయడమే ఆయన ముందున్న లక్ష్యం’’ అని మిల్స్‌ అంచనా వేస్తున్నారు. యూదుడైన జెలెన్‌స్కీని ఉక్రెయిన్‌ గద్దె దింపి ‘‘నాజీరహితం’’ చేయడమే రష్యా లక్ష్యమన్న సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశాలున్నాయి.

మార్షల్‌ లా అమలు చేస్తారా ?
ఈ ఏడాది విక్టరీ డే ప్రసంగంలో పుతిన్‌ మార్షల్‌ చట్టాన్ని ప్రకటిస్తారన్న ఊహాగానాలున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేస్తే ఎన్నికల నిర్వహణ రద్దవుతుంది. అధికారాలన్నీ పుతిన్‌ చేతిలోనే ఉంటాయి. 18 ఏళ్ల వయసు నిండిన యువకులందరూ అవసరమైతే కదనరంగానికి వెళ్లాల్సి వస్తుంది. వారు దేశం విడిచి పెట్టి వెళ్లడానికి వీల్లేదు. అయితే ఇలాంటి కఠినమైన చట్టాన్ని తీసుకువస్తే రాజకీయంగా పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.

శిథిల ఉక్రెయిన్‌
► ఉక్రెయిన్‌పై రష్యా నిర్విరామంగా దాడులు చేస్తూ 75 రోజులు గడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆ చిన్న దేశంలో జరిగే నష్టం అపారంగా ఉంది. కీవ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ చేసిన అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు 60 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది.
► మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో జరిగిన ఆర్థిక నష్టం 9,200 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని ఒక అంచనా.
► వ్యాపారాలు దెబ్బ తినడంతో వెయ్యి కోట్ల డాలర్ల నష్టం సంభవించింది.
► 195 ఫ్యాక్టరీలు, 230 ఆరోగ్య కేంద్రాలు, 940 విద్యా సంస్థలు, అయిదు రైల్వేస్టేషన్లు, 95 ప్రార్థనాలయాలు, 140 వారసత్వ, సాంస్కృతిక భవంతులు రష్యన్‌ దాడుల్లో ధ్వంసమయ్యాయి
► 23,800 కిలోమీటర్ల రహదారులు నాశనమయ్యాయి. వీటి విలువే 6 వేల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా
► నెలకి 700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం లభిస్తే తప్ప ఉక్రెయిన్‌ కోలుకునే పరిస్థితి లేదు.

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు