Russia Ukraine War: ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడులు

1 Oct, 2022 05:07 IST|Sakshi

జపోరిజియాలో మానవతా కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 30 మంది మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు.  రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న తమ బంధువులకి వస్తు సామాగ్రిని అందించడం కోసం వెళుతుండగా ఆ మానవతా కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. రష్యాలో తయారైన ఎస్‌–300 క్షిపణులతో ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు.  

విలీన ఒప్పందంపై పుతిన్‌ సంతకం  
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే ఒప్పందంపై అధ్యక్షుడు  పుతిన్‌ శుక్రవారం సంతకాలు చేశారు. డాంటెస్క్, లుహాన్సŠక్, ఖెర్సాన్, జపోరిజియా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామని ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనమవడానికి అంగీకరించాయని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు చెందిన రష్యా అనుకూల పాలకులు హాజరవగా క్రెమ్లిన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్‌ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను అన్ని విధాల కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్‌ వెంటనే శాంతి చర్చలకు రావాలని కోరారు. తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను మళ్లీ వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని పుతిన్‌ తేల్చి చెప్పారు.తమ దేశాన్ని ఒక కాలనీగా మార్చి, తమ ప్రజల్ని పిరికివాళ్లయిన బానిసలుగా మార్చడానికి పశ్చిమ దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరోపియన్‌ యూనియన్, పశ్చిమ దేశాలు ఆ విలీనాన్ని అంగీకరింబోమని స్పష్టం చేశాయి. ప్రజాభిప్రాయం పేరుతో వారిపై తుపాకులు పెట్టి బలవంతంగా విలీనం చేసుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి.  మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో కూటమిలో తమ దేశాన్ని చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యాకి చెందిన  వెయ్యి మంది ప్రజలు, సంస్థలు తమ దేశానికి రాకుండా అమెరికా వారి వీసాలపై నియంత్రణ విధించింది.

మరిన్ని వార్తలు