Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాం

12 May, 2022 03:05 IST|Sakshi

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఖర్కీవ్‌లోని నాలుగు గ్రామాల నుంచి రష్యా సేనలు వెనక్కి

కీవ్‌: రష్యా దళాలపై తమ సేనలు క్రమంగా పైచేయి సాధిస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఖర్కీవ్‌ నుంచి రష్యా సైనికులను వెనక్కి తరిమేస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య ఖర్కీవ్‌ ప్రాంతంలోని నాలుగు గ్రామాల నుంచి రష్యా జవాన్లను తరిమికొట్టినట్లు ఉక్రెయిన్‌ సైన్యం సైతం ప్రకటించింది. తమ ధాటికి తట్టుకోలేక వారు రష్యా సరిహద్దు దిశగా తరలిపోతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్‌ సైన్యంతో పోలిస్తే రష్యా సైన్యం ఎన్నో రెట్లు బలమైనది. అయినప్పటికీ రష్యా ఇప్పటికీ ఉక్రెయిన్‌పై పట్టు సాధించలేకపోవడం గమనార్హం. ఉక్రెయిన్‌లో చాలాచోట్ల రష్యాకు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది.

రష్యా టి–90 యుద్ధ ట్యాంకు ధ్వంసం
రూ.28 కోట్ల (3 మిలియన్‌ పౌండ్ల) ఖరీదైన రష్యా టి–90 వ్లాదిమిర్‌ యుద్ధ ట్యాంకును ఉక్రెయిన్‌ సైన్యం ధ్వంసం చేసింది. ఇందుకోసం ఉక్రెయిన్‌ ఆర్‌18 అనే సొంత డ్రోన్‌ను ఉపయోగించడం విశేషం. ఈ డ్రోన్‌ ద్వారా కేవలం రూ.38 వేల విలువైన (400 పౌండ్లు) రాకెట్లను జారవిడిచి టి–90 ట్యాంకును ఉక్రెయిన్‌ ధ్వంసం చేసింది. ఈ దృశ్యాలను ఉక్రెయిన్‌ డ్రోన్‌ వార్‌ఫేర్‌ యూనిట్‌ విడుదల చేసింది. ఆర్‌18 డ్రోన్‌ 5 కిలోల పేలోడ్లను మోసుకెళ్లగలదు.

రష్యా గ్యాస్‌ సరఫరా నిలిపివేత
ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం మొదలయ్యాక తొలిసారిగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ నుంచి యూరప్‌ దేశాలకు సరఫరా అవుతున్న సహజ వాయువును ఓ ఉక్రెయిన్‌ ఆపరేటర్‌ నిలిపివేశాడు. యూరప్‌కు గ్యాస్‌ రవాణాకు రష్యా ఇక ఇతర మార్గాలు చూసుకోవాల్సిందేనంటున్నారు. రష్యా గ్యాస్‌లో నాలుగింట మూడొంతులు ఉక్రెయిన్‌ గుండానే సరఫరా అవుతోంది.

రష్యా విస్తరణ యత్నాలకు ఎదురు దెబ్బ
నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌లో రష్యా దళాలపై ఉక్రెయిన్‌ సైన్యం ఎదురు దాడికి దిగుతోందని బ్రిటిష్‌ మిలటరీ తెలిపింది. నల్లసముద్రంలో పెత్తనాన్ని విస్తరించేందుకు రష్యా ప్రయత్నాలకు ఇది విఘాతమని ట్వీట్‌ చేసింది.

హిట్లర్‌/స్టాలిన్‌ కంటే పుతిన్‌ డేంజర్‌
హిట్లర్‌/స్టాలిన్‌ వంటి నియంతల కంటే పుతిన్‌ ప్రమాదకారి అని పోలండ్‌ ప్రధాని మాటిసుజ్‌ మోరావీకి అన్నారు. పుతిన్‌ది రాక్షస భావజాలమని, దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 20వ శతాబ్దపు నియంతల వద్ద ఉన్నవాటికంటే ఎక్కువ అపాయకరమైన మారణాయుధాలు పుతిన్‌ వద్ద ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ లేని ప్రపంచం(డిపుతినైజేషన్‌) సాకారం కావాలని మోరావికీ ఆకాంక్షించారు. రష్యా అధ్యక్షుడి సిద్ధాంతం కేవలం ఉక్రెయిన్‌కే కాదు, మొత్తం యూరప్‌కు ముప్పేనని ఉద్ఘాటించారు.

నలుగురు రష్యా రీజినల్‌ గవర్నర్ల రాజీనామా
పశ్చిమ దేశాల ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నలుగురు రష్యన్‌ రీజినల్‌ గవర్నర్లు పదవులకు రాజీనామా చేశారు. టామ్‌స్క్, సరాటోవ్, కిరోవ్, మారీ ఎల్‌ గవర్నర్లు పదవుల నుంచి తప్పుకున్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని రైజాన్‌ రీజినల్‌ గవర్నర్‌ చెప్పారు. ఈ ఐదు రీజియన్లకు వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.

మరిన్ని వార్తలు