Russia-Ukraine war: డోన్బాస్‌పై రష్యా సేనల గురి

23 May, 2022 06:17 IST|Sakshi
డోన్బాస్‌లోని రిఫైనరీపై రష్యా బాంబు దాడి

అత్యాధునిక ఆయుధాలతో దాడులు

కీవ్‌: ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌ సిటీని విజయవంతంగా స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ఇక తూర్పున పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్‌సై ప్రధానంగా గురిపెట్టాయి. క్షిపణుల వర్షం కురిపించాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడికి దిగాయి. డోన్బాస్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదులు అధికంగా ఉండడం పుతిన్‌ సైన్యానికి కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లుహాన్‌స్క్‌ ప్రావిన్స్‌లోని ముఖ్య నగరం సీవిరోడోంటెస్క్‌లో పాగా వేయడానికి రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డోన్బాస్‌లో ఒక భాగమైన డోంటెస్క్‌ ప్రావిన్స్‌లోని స్లోవానిస్క్‌లో మళ్లీ దాడులు ప్రారంభిస్తామని రష్యా సైన్యం ప్రకటించింది.

డోంటెస్క్‌లో శనివారం రష్యా బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని స్థానిక గవర్నర్‌ వెల్లడించారు. బొహోరోడిచిన్‌ గ్రామంలోని ఓ చర్చిలో తలదాచుకుంటున్న 100 మంది క్రైస్తవ మతాధికారులు, పిల్లలను అధికారులు ఖాళీ చేయించారు. ఇక్కడ రష్యా వైమానిక దాడులు సాగిస్తుండడమే ఇందుకు కారణం. మారియుపోల్‌ అజోవ్‌స్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ నుంచి 2,500 మంది ఉక్రెయిన్‌ సైనికులను ఖైదీలుగా అదుపులోకి తీసుకున్నామని రష్యా స్పష్టం చేసింది. దీంతో సదరు సైనికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.  

త్వరగా ఈయూలో చేర్చుకోండి: జెలెన్‌స్కీ
డోన్బాస్‌లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళకరంగానే ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. ఆయన తాజాగా దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. రష్యా సేనలను ఉక్రెయిన్‌ను దళాల కచ్చితంగా ఓడిస్తాయని పేర్కొన్నారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో తమ దేశాన్ని సాధ్యమైనంత త్వరగా యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో చేర్చుకోవాలని జెలెన్‌స్కీ మరోసారి కోరారు. ఈ విషయంలో ఈయూలోని 27 సభ్యదేశాలు వెంటనే చొరవ తీసుకోవాలని విన్నవించారు.  ఈయూలో ఉక్రెయిన్‌ చేరికకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఫ్రాన్స్‌ మంత్రి క్లెమెంట్‌ బ్యూనీ చెప్పారు. ఏడాది, రెండేళ్లలో ఈయూలో ఉక్రెయిన్‌ భాగస్వామి అవుతుందనడం ముమ్మాటికీ అబద్ధమేనన్నారు.  

సిరియా నుంచి బ్యారెల్‌ బాంబు నిపుణులు
సిరియా నుంచి రష్యాకు మద్దతుగా 50 మంది బ్యారెల్‌ బాంబు నిపుణులు వచ్చినట్లు ఉక్రెయిన్‌ నిఘా వర్గాలు వెల్లడించాయి. వీరు తయారు చేసిన బాంబులు సిరియాలో పెను విధ్వంసం సృష్టించాయి.

రష్యాకు అపజయమే: అండ్రెజ్‌ డుడా
పోలండ్‌ అధ్యక్షుడు అండ్రెజ్‌ డుడా ఆదివారం కీవ్‌లో పర్యటించారు. ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.  ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు  విజయం దక్కదని జోస్యం చెప్పారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్‌ పార్లమెంట్‌లో మాట్లాడిన తొలి విదేశీ నేత డుడానే.

మరిన్ని వార్తలు