Russia-Ukraine War: ప్రధాన నగరాలే టార్గెట్‌

19 Mar, 2022 04:51 IST|Sakshi
రష్యా దాడులతో కీవ్‌లో మంటల్లో చిక్కుకున్న గోదాం.. ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది

కీవ్, లెవివ్, ఖర్కీవ్, క్రామాటోర్‌స్క్, మారియుపోల్‌లో క్షిపణుల వర్షం 

చెర్నిహివ్‌లో ఒక్కరోజులో 53 మృతదేహాలు మార్చురీలకు..   

కీవ్‌/లెవివ్‌/మాస్కో/వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ ప్రధాన నగరాలపై రష్యా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌  శివార్లతో పాటు పశ్చిమాన లెవివ్‌ సిటీపై శుక్రవారం ఉదయం భీకర దాడులు జరిపింది. లెవివ్‌ నడిబొడ్డున బాంబుల మోత మోగించింది. కొన్ని గంటలపాటు దట్టమైన పొగ వ్యాపించింది. క్షిపణి దాడుల్లో ఎయిర్‌పోర్టు సమీపంలో యుద్ధ విమానాల మరమ్మతు కేంద్రం, బస్సుల మరమ్మతు కేంద్రం దెబ్బతిన్నాయి.

రష్యా నల్ల సముద్రం నుంచి లెవివ్‌పై క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్‌ వైమానిక దళం ప్రకటించింది. క్రామాటోర్‌స్క్‌ సిటీలో ఇళ్లపైనా క్షిపణులు వచ్చి పడుతున్నాయి. ఖర్కీవ్‌లో మార్కెట్లను కూడా వదలడం లేదు. చెర్నిహివ్‌లో ఒక్కరోజే 53 మృతదేహాలను మార్చురీలకు తరలించారు. మారియుపోల్‌లో బాంబుల మోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బాంబు దాడులకు గురైన థియేటర్‌ నుంచి 130 మంది బయటపడగా 1,300 మంది బేస్‌మెంట్‌లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు.

రష్యా కల్నల్, మేజర్‌ మృతి
ఉక్రెయిన్‌ సైన్యం దాడుల్లో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్‌ సెర్గీ సుఖరెవ్, మేజర్‌ సెర్గీ క్రైలోవ్‌ కూడా వీరిలో చనిపోయినట్టు రష్యా అధికారిక టెలివిజన్‌ కూడా దీన్ని ధ్రువీకరించింది. రష్యా ఇప్పటిదాకా 7,000 మందికి పైగా సైనికులను కోల్పోయినట్టు సమాచారం.

బైడెన్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు
తమకు అదనపు సైనిక సాయం అందించిన      అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌ సైనిక సామర్థ్యాన్ని రష్యా సరిగా అంచనా వేయలేకపోయిందన్నారు.

ఆపేయండి: హాలీవుడ్‌ దిగ్గజం ఆర్నాల్డ్‌
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని ప్రఖ్యాత హాలీవుడ్‌ హీరో ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్‌ రష్యాకు సూచించారు. పుతిన్‌ స్వార్థ ప్రయోజనాల కోసం రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ‘‘నా తండ్రి కూడా కొందరి మాయమాటలు నమ్మి హిట్లర్‌ తరపున రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. భౌతికంగా, మానసికంగా గాయపడి ఆస్ట్రియాకు తిరిగొచ్చారు’’ అన్నారు.

మానవత్వం చూపాల్సిన సమయం: భారత్‌
రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, సామాన్యులు మృత్యువాత పడుతున్నారని ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. నిరాశ్రయులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరముందని భద్రతా మండలి భేటీలో ఆయనన్నారు. భారత్‌ తనవంతు సాయం అందిస్తోందని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో సామాన్యులు చనిపోతుండడం తీవ్ర ఆందోళనకరమని  ఐరాస పొలిటికల్‌ చీఫ్, అండర్‌ సెక్రెటరీ జనరల్‌ రోజ్‌మేరీ డికార్లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 60.6 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది.

ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా
ఉక్రెయిన్‌తో తాము జరుపుతున్న చర్చల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని రష్యా తరపు బృందానికి సారథ్యం వహిస్తున్న వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ శుక్రవారం చెప్పారు. ఉక్రెయిన్‌కు తటస్థ దేశం హోదా ఉండాలని తాము కోరుతున్నామని, ఈ విషయంలో ఒక ఒప్పందానికి ఇరుపక్షాలు దగ్గరగా వచ్చినట్లు వెల్లడించారు. నాటోలో చేరాలన్న ఉక్రెయిన్‌ ఉద్దేశం పట్ల ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు క్రమంగా తగ్గిపోతున్నాయన్నారు.

ర్యాలీలో పాల్గొన్న పుతిన్‌
రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం రాజధాని మాస్కోలో భారీ ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పం రష్యాలో విలీనమై 8 ఏళ్లయిన సందర్భంగా మాస్కోలోని లుఝ్‌నికీ స్టేడియం చుట్టూ ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న తమ సైనిక బలగాలపై ఈ సందర్భంగా పుతిన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లో నాజీయిజంపై పుతిన్‌ పోరాడుతున్నారని వక్తలన్నారు.

రష్యా చమురుపై జర్మనీ ఆంక్షలు!
ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యాకు ముకుతాడు వేయక తప్పదన్న సంకేతాలను జర్మనీ ఇచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా బెయిర్‌బాక్‌ చెప్పారు. చమురు కోసం తాము రష్యాపై ఆధారపడుతున్నప్పటికీ ఇది మౌనంగా ఉండే సమయం కాదన్నారు. క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.  జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో ఫోన్‌లో దాదాపు గంటపాటు మాట్లాడారు. ఉక్రెయిన్‌లో కాల్పులు విరమణకు వెంటనే అంగీకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు