Russia-Ukraine war:శరణమో, మరణమో

14 Jun, 2022 05:10 IST|Sakshi

సెవెరోడొనెట్స్‌క్‌ పౌరులకు మిగిలింది ఒక్కటే అవకాశం

కీవ్‌/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడొనెట్స్‌క్‌ నగరంలో మారియూపోల్‌ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్‌ ప్లాంట్‌లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. డోన్బాస్‌లో భారీ సంఖ్యలో ఉక్రెయిన్‌ ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సోమవారం తెలియజేసింది. వుహ్లెదర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం.

40,000 మంది రష్యా జవాన్లు బలి!
జూన్‌ ఆఖరు నాటికి రష్యా సైన్యం 40,000 మంది జవాన్లను కోల్పోనుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. డోన్బాస్‌లోకి రిజర్వు బలగాలను దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు.  యుద్ధం మరో రెండేళ్లపాటు కొనసాగుతుందని రష్యా మాజీ ప్రధాని కాస్యనోవ్‌ అంచనా వేశారు.

20 మంది మహిళలపై వేధింపులు: అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారన్న ఆనుమానంతో రష్యా పోలీసులు 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని, అమానవీయంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ రష్యాలోని నిజ్నీ నొవోగొరోడ్‌లో ఈ దారుణం జరిగిందని బాధితుల తరపు న్యాయవాది చెప్పారు. రష్యా పోలీసులు 18 నుంచి 27 ఏళ్ల వయసున్న 20 మంది మహిళలను వివస్త్రలను చేసి, ఐదుసార్లు స్క్వాట్స్‌ చేయించారని తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఫోన్లలో వీడియో తీశారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు