Russia-Ukraine war: నెమ్మదించిన రష్యా

1 May, 2022 04:36 IST|Sakshi

డోన్బాస్‌లో మరిన్ని ఎదురుదెబ్బలు

ఖర్కీవ్‌: యుద్ధంలో రష్యాకు నానాటికీ ప్రతికూల పరిణామాలే ఎదురవుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ద్వారా యుద్ధాన్ని గౌరవప్రదంగా ముగించాలన్న రష్యా ఆశలు ఫలించడం లేదని అమెరికా అంటోంది. అక్కడ కూడా రష్యా దాడులను ఉక్రెయిన్‌ సమర్థంగా అడ్డుకుంటోంది. దాంతో రష్యా యుద్ధ ప్రణాళిక బాగా నెమ్మదించిందని యూఎస్‌ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో పుతిన్‌ సేనల నైతిక స్థైర్యం నానాటికీ మరింతగా దిగజారుతోందని ఇంగ్లండ్‌ అభిప్రాయపడింది.

శనివారం లుహాన్స్‌క్‌లో పలు ప్రాంతాలపై దాడికి దిగిన రష్యా సైనికుల్లో అత్యధికులను హతమార్చినట్టు స్థానిక గవర్నర్‌ తెలిపారు. డోన్బాస్‌ను పూర్తిగా నేలమట్టం చేయాలని, అక్కడున్న వారందరినీ హతమార్చాలని రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆరోపించారు. ఖర్కీవ్‌లో సగానికి పైగా నివాస సముదాయాలు మరమ్మతులకు వీలు కానంతగా దెబ్బ తిన్నాయని నగర మేయర్‌ చెప్పారు. ఆంక్షల దెబ్బకు రష్యా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 10 శాతానికి పైగా కుంచించుకుపోతుందని ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు పాశ్చాత్య దేశాలే తూట్లు పొడుస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు