Russia-Ukraine War Updates: War Updates: ఉక్రెయిన్‌ సంక్షోభం.. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం

5 Mar, 2022 20:44 IST|Sakshi

Russia-Ukraine War Day 10 LIVE Updates: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు పదో రోజుకు చేరుకున్నాయి. రాజధాని కీవ్, ఖర్కీవ్‌ నగరాలు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. కీవ్‌లో అయితే కనీసం ప్రతి 10 నిమిషాలకు ఒక పేలుడు జరిగిందని సమాచారం. క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల బీభత్సం తీవ్రంగా ఉందని ఉక్రెయిన్‌ చెబుతోంది. 


►ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశమయ్యారు.. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు, భారతీయుల తరలింపు వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 

 ఖార్కివ్, సుమీ ప్రాంతాల మినహా ఉక్రెయిన్ నుంచి 10,000 మంది కి పైగా భారతీయులను తరలించినట్లు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఖర్కివ్‌ సుమీలో భీకర యుద్ధం కొనసాతున్నప్పటికీ.. అక్కడి నుంచి కూడా భారతీయులను సురక్షితంగా తరలిస్తామని పేర్కొంది. 

►ఉక్రెయిన్‌లో రష్యాకు చెందిన మరో విమానాన్ని ఆ దేశ ఆర్మీ అధికారులు కూల్చివేశారు. చెర్నివ్‌ సరిహద్దులో రష్యా విమానాన్ని ఉక్రెయిన్‌ కూల్చేసింది. అయిత పారాచూట్‌ సాయంతో పైలేట్లు ప్రాణాల రక్షించుకున్నారు.

రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానం
►రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని పేర్కొన్నారు. ఇందుకు నాటో దేశాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆ మేరకు శనివారం మహిళా పైలట్లతో పుతిన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊహించనిదాకంటే ఉక్రెయిన్‌పై భీకరంగా యుద్ధం సాగిస్తామని తెలిపారు.

► గత 24 గంటల్లో దాదాపు 2,900 మందితో 15 విమానాలు భారత్‌కు చేరుకున్నాయని కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు సుమారు 13,300 మంది భారతదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపింది. మరో  24 గంటలలో 13 విమానాలు  రానున్నట్లు పేర్కొంది.

ఉక్రెయిన్‌ ప్రజల తిరుగుబాటు
రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఉ‍క్రెయిన్‌ ప్రజలు తిరగబడుతున్నారు. యుద్ధాన్ని ఆపాలంటూ రోడ్డెక్కిన ప్రజలు తమ దేశానికి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్‌ నగరంలో వందలాది మంది ఉక్రెయిన్లు రడ్లపైకి వచ్చారు. యుద్ధ ట్యాంకర్లకు కూడా వెరవకుండా రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. కాగా మార్చి 3న ఖేర్సన్‌ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ చేరుకున్న 145 మంది తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్‌ నుంచి శనివారం ఒక్కరోజే 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు విమానాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 83 మంది, తెలంగాణకు చెందిన 62 మంది విద్యార్థులు తరలి వచ్చారు. వీరిని సాయత్రం స్వస్థలాలకు పంపనున్నారు.

ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చేయండని చెప్పాలని ఉంది
ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చేయండి అని తమ పౌరులకు త్వరలోనే పిలుపునివ్వగలమని ఆశిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇక్కడ ఎలాంటి ముప్పు లేనందున పోలాండ్‌, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు తరలి వెళ్లిన వారు ఉక్రెయిన్‌కు తిరిగి రావొచ్చు.  అని చెప్పే రోజులు దగ్గర్లోనేఉన్నాnయనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈమేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

వారం రోజుల్లో 6222 మంది భారతీయులను తరలించాం
గతం వారం రోజుల్లో రొమేనియా,మోల్డోవాల నుంచి 6,222 మంది భారతీయులను తరలించినట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తెలిపారు. విద్యార్థులను ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి 500 కి.మీ దూరంలో ఉన్న బుకారెస్ట్‌కు తరలించడానికి బదులుగా ఉక్రెయిన్‌ సరిహద్దుకు 50 కి.మీ దూరంలో ఉన్న సుసేవా ఎయిర్‌పోర్టు నుంచి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల్లో 1050 మంది విద్యార్థులు భారత్‌కు చేరుకోనున్నట్లు తెలిపారు.

10 వేల మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్
రష్యా సైనిక బలగాల్లో ఇప్పటివరకు 10 వేల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. అలాగే పెద్ద సంఖ్యలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. రష్యాకు చెందిన 269 ట్యాంకులు, 945 సాయుధ పోరాట వాహనాలు, 105 ఆర్టిలరీ వ్యవస్థలు, 50, మల్టీపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌లు, 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు గతంతో పోలిస్తే తగ్గుముఖం
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు గతంతో పోలిస్తే తగ్గాయని బ్రిటన్ పేర్కొంది. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లో రష్యా వైమానిక, ఫిరంగి దాడుల రేటు మునుపటి రోజుల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. అయితే రష్యా దళాలు ఉక్రెయిన్‌ దక్షిణాన పురోగమిస్తున్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ కీలక నగరాలైన ఖార్కివ్, చెర్నిహివ్, మారియుపోల్‌లను తన ఆధీనంలో ఉంచుకునేందుకు పోరాడుతోందని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే ఈ నాలుగు నగరాలను రష్యా బలగాలు చుట్టుముట్టే అవకాశం ఉందని తెలిపింది.

పారిపోలేదు..ఇక్కడే ఉన్నా: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు
యుద్ధంలో ఓటమి భయం, ప్రాణ భయంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. పోల్యాండ్‌కు పారిపోయాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్‌స్కీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించాడు. యుద్ధంలో ఓటమి భయం, ప్రాణ భయంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. పోల్యాండ్‌కు పారిపోయాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్‌స్కీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించాడు. 

ఉక్రెయిన్‌- రష్యా చర్యలకు టర్కీ ఆతిథ్యం 
ఉక్రెయిన్‌లో యుద్ధంపై చర్చించడానికి టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడతారని ఆ దేశ ప్రతినిధి ఇబ్రహీం కలిన్ శనివారం తెలిపారు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభాన్ని పరిష్కరించడానికి టర్కీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.. ఈ మేరకు ఇస్తాంబుల్‌లో మాట్లాడుతూ, ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి టర్కీ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే తక్షణమే పోరాటాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అయితే టర్కీ ఇటు మాస్కో అటు కైవ్‌తో గానీ సంబంధాలను వదులుకోలేదని స్పష్టం చేశారు.

సుమీలోని భారతీయ విద్యార్థుల పట్ల తీవ్ర ఆందోళన
ఉక్రెయిన్‌లోని సుమీలో ఉన్న భారతీయ విద్యార్థుల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తెలిపారు. భారతీయ విద్యార్థుల తరలింపు కోసం సురక్షితమైన కారిడార్‌ను రూపొందించడానికి తక్షణ కాల్పుల విరమణ చేయాలని అనేక మార్గాల ద్వారా రష్యన్, ఉక్రేనియన్ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యార్థులంతా భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని, షెల్టర్‌లలోనే ఉండాలని సూచించారు

విదేశీ విద్యార్థులను తరలించేందుకు కృషి చేస్తున్నాం
సుమీ నగరంలో చిక్కుకుపోయిన వందలాది మంది విదేశీ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు చేయగలిగినదంతా చేస్తున్నామని ఉక్రెయిన్‌ విదేశాంగశాఖ పేర్కొంది. రష్యా భయంకర దాడులతో సుమీ నగరం ప్రస్తుతం మానవతా విపత్తు అంచున ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు తమ శక్తిమేర కృషి చేస్తున్నట్లు ట్వీట్‌ ద్వారా వెల్లడించింది.

భారతీయుల తరలింపుకు ప్రత్యేక బస్సులు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబసీ అధికారులు తెలిపారు. పీసోచిన్‌లో ఉన్న 298 మంది భారతీయులను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

ఉక్రెయిన్‌ పోరాటంలో చేరిన 66 వేల మంది
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తమ దేశం తరుపున పోరాడేందుకు వివిధ దేశాల్లో ఉన్న 66, 220 మంది ఉక్రెయిన్లు దేశానికి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ దేశ రక్షణశాఖ మంత్రి ఒలెక్సీ రెజినికోవ్‌ తెలిపారు.

► రష్యాకు షాకిచ్చిన శాంసంగ్‌ కంపెనీ
ఉక్రెయిన్‌-రష్యాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు మద్దతు ప్రకటిస్తుంటే.. మరోవైపు పలు కంపెనీలు రష్యాకు షాకిస్తున్నాయి. తాజాగా దక్షిణ కోరియా దిగ్గజం శాంసంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు తమ ఉత్పత్తులు, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి శాంసంగ్‌ ప్రకటన విడుదల చేసింది. 

ఉక్రెయిన్‌ యుద్దానికి బ్రేక్‌!
ఉక్రెయిన్‌ యుద్ధానికి రష్యా బ్రేక్‌ వేసింది. ఐదున్నర గంటలపాటు విదేశీయుల తరలింపు కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 11.30ని. నుంచి ఈ వార్‌ బ్రేక్‌ అమలులోకి రానుంది. ఈలోపు విదేశీయులను తరలించే యోచనలో ఉక్రెయిన్‌ ఉంది..

► భారత్‌ చేరుకున్న మరో 629 మంది విద్యార్థులు 
ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్థులు స్వదేశానికి చేరుకుంటున్నారు. శనివారం ప్రత్యేక విమానంలో మరో 629 మంది విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. ఆపరేషన్‌ గంగా పేరిట భారత వాయుసేన విమానాలు రొమేనియా, స్లోకొవియా, పోలండ్‌ మీదుగా  విద్యార్థులను స‍్వదేశానికి చేర్చుతున్నాయి. 

► అణు విద్యుత్‌ ప్లాంట్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్‌
శుక్రవారం జరిపిన దాడుల్లో రష్యా బలగాలు జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంటును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ప్రతి దాడుల్లో మళ్లీ జపోరిజ్జియా ప్లాంటును తాము చేజిక్కించుకున్నట్టు ఉక్రెయిన్‌ పేర్కొంది. 

► కీవ్‌లో వైమానిక దాడి హెచ్చరిక..
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా బలగాలు వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కీవ్‌ అధికారులు అక్కడి ప్రజలను హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో భద్రత ఉన్న ప్రాంతాలకు వారు వెళ్లిపోవాలని సూచించారు. 

► ఉక్రెయిన్‌ విజ్ఞప్తిపై నాటో దేశాలు మరోసారి జెలెన్‌ స్కీకి షాకిచ్చాయి. ‘నో-ఫ్లై జోన్’ విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. శుక్రవారం రాత్రి బస్సెల్స్‌లో నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో జనరల్‌ సెక్రటరీ స్టోలెన్‌ బర్గ్‌ వెల్లడించారు. 

► రష్యాలో గూగుల్‌, యూట్యూబ్‌ బ్యాన్‌
ఉక్రెయిన్‌పై యుద్దం వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటు ట్విట్టర్, ఫేస్‌బుక్, బీబీసీ, యాప్‌ స్టోర్‌ సేవలను రష్యా నిలిపి వేసింది. మరోవైపు రష్యా స్టేట్‌ మీడియాపై మెటా, గూగుల్‌, యూట్యూబ్‌ నిషేధం విధించాయి. 

► ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు కమలా హారిస్‌
ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన పోలండ్‌, రొమేనియా దేశాల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ కీలక పర్యటన చేపట్టనున్నారు. మార్చి 9-11 మధ్య పోలండ్​లో రాజధాని వార్సా​, రొమేనియాలోని బుకారెస్ట్​లో పర్యటించనున్నట్టు కమలా హారిస్​ డిప్యూటీ ప్రెస్​ సెక్రటరీ సబ్రినా సింగ్​ తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌, రష్యా సంక్షోభంపై చర్చించనున్నట్టు చెప్పారు. ​అలాగే ఉక్రెయిన్​కు భద్రత, ఆర్థిక, మానవతా సాయం వంటి కీలక అంశాలపైనా కూడా చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది.


 నేడు భారత్‌కు 15 విమానాలు..
న్యూఢిల్లీ:
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి 11 పౌర విమానాలు, 4 భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) విమానాలను పంపించినట్లు పౌర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇవి ఉక్రెయిన్‌ పొరుగు దేశాల నుంచి శనివారం భారత్‌కు చేరుకుంటున్నాయని తెలిపింది. పౌర విమానాల్లో 2,200 మందికిపైగా భారతీయులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. వీటిలో 10 విమానాలు ఢిల్లీలో, ఒకటి ముంబైలో ల్యాండవుతాయని వెల్లడించింది. 4 ఐఏఎఫ్‌ విమానాల్లో ఎంతమంది వస్తారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తొలుత రొమేనియా, హంగేరి, స్లొవేకియా, పోలాండ్‌ దేశాలకు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 11 పౌర విమానాలు, 3 ఐఏఎఫ్‌ విమానాలు 3,772 మందితో భారత్‌కు చేరుకున్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

 రష్యాకు షాక్‌.. ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన సామ్‌సంగ్‌
ఉక్రెయిన్‌పై యుద్దంతో రష్యాపై ఆంక్షలు పర్వం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రష్యాకు ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ చిప్స్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సామ్‌సంగ్‌ ప్రకటించింది. తమ సంస్థ ఉద్యోగుల స్వచ్చంద విరాళాలతో ఉక్రెయిన్‌కు 6 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు సామ్‌సంగ్‌ పేర్కొంది. సంస్థ సైతం ఒక మిలియన్‌ డాలర్ల సాయం అందిస్తున్నట్టు సామ్‌సంగ్ వెల్లడించింది.  

 కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా అణు చెలగాటమాడుతోంది. వారం కింద చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న వైనాన్ని మర్చిపోకముందే మరో అణు ప్లాంట్‌పై దాడికి తెగబడింది. ఆగ్నేయ ప్రాంతంలో ఎనర్‌హోడర్‌ నగరంపై గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు యుద్ధ ట్యాంకులతో భారీ దాడులకు దిగాయి. దాన్ని ఆక్రమించే ప్రయత్నంలో యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం వద్దా బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. 

భద్రతా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి వాటిని ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడుల్లో ప్లాంటులోని శిక్షణ కేంద్రం దెబ్బ తిన్నది తప్పిస్తే అందులోని ఆరు రియాక్టర్లకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్‌ రాఫెల్‌ గ్రోసీ అన్నారు. రష్యా దుశ్చర్య యూరప్‌ వెన్నులో చలి పుట్టించింది. ప్రపంచ దేశాలన్నింటినీ షాక్‌కు గురిచేసింది. చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రం పేలుడు తాలూకు ఉత్పాతాన్ని తలచుకుని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాది మతిమాలిన చర్య అంటూ యూరప్‌ దేశాలన్నీ దుమ్మెత్తిపోశాయి.

మరిన్ని వార్తలు