Russia-Ukraine War: ఇండియన్‌ నన్స్‌కు ఇక్కట్లు

24 Mar, 2022 05:41 IST|Sakshi

కీవ్‌లో సేవలందిస్తున్న భారతీయ నన్స్‌

నిత్యావసరాల కొరతతో ఇబ్బందులు

అయినా సేవల కొనసాగింపు

ఐజ్వాల్‌: రష్యా దాడితో రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో భారత్‌కు చెందిన మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌ సంస్థ మిజోరాం విభాగానికి చెందిన నన్స్‌ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. యుద్ధం తీవ్రం కావడంతో రాజధానిలో సేవలనందిస్తున్న ఈ నన్స్‌ నిత్యావసరాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక శిబిరంలో తాము సేవలనందిస్తున్న నిరాశ్రయులతో కలిసి క్షేమంగా ఉన్నామని, అయితే కనీసావసరాల కోసం బయటకు  వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. ఎన్ని బాధలైనా పడతామని, సేవా కార్యక్రమం విరమించి వెనక్కురామని సిస్టర్‌ రోసెలా నూతంగి, సిస్టర్‌ ఆన్‌ ఫ్రిదా స్పష్టం చేశారు. వీరితో పాటు వేరే దేశాలకు చెందిన మరో ముగ్గురు నన్స్‌ కలిసి 37 మంది నిరాశ్రయులను, ఒక కేరళ విద్యార్థిని సంరక్షిస్తున్నారు. వీరంతా క్షేమమేనని, కానీ ఆహారం కొరతతో బాధపడుతున్నారని రోసెలా బంధువు సిల్వీన్‌ చెప్పారు.

కీవ్‌లో తాము బాగానే ఉన్నామని రోసెలా చెప్పారని సిల్వీన్‌ తెలిపారు. సంస్థలో రోసెలా 1981లో చేరారు. 1991లో ఒక మిషన్‌ కోసం సోవియట్‌కు వెళ్లారు. అక్కడ ఆమె 10 ఏళ్లు పనిచేశారు. 2013లో ఆమె ఉక్రెయిన్‌ చేరారని, రష్యన్‌ భాషలో ఆమెకు పట్టు ఉందని సిల్వీన్‌ తెలిపారు. గతంలో రెండుమార్లు మాత్రమే ఆమె ఇండియాకు వచ్చారన్నారు. మరో నన్‌ ఫ్రిడా 1995లో సంస్థలో చేరారు. అనంతరం అనేక దేశాల్లో సేవలనందించి 2019లో ఉక్రెయిన్‌ చేరారు. తమ సంస్థకు చెందిన ఐదుగురు నన్స్‌ ఉక్రెయిన్‌లో సేవలనందిస్తున్నారరని సంస్థ సుపీరియర్‌ జనరల్‌ సిస్టర్‌ మేరీ జోసెఫ్‌ చెప్పారు. వీరిని వెనక్కురమ్మని తాము కోరామని, కానీ సేవను విరమించి వచ్చేందుకు వీరు అంగీకరించలేదని తెలిపారు. స్థానికులకు సాయం అందిస్తూ వీరు కీవ్‌లో తలదాచుకుంటున్నారన్నారు. వీరి భద్రతపై రష్యా, ఉక్రెయిన్, భారత ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు