Russia-Ukraine war: యుద్ధ నేరాలపై రష్యా సైనికుడి విచారణ

14 May, 2022 05:19 IST|Sakshi

యావజ్జీవ శిక్ష విధించే అవకాశం  

నాటోలో చేరొద్దంటూ ఫిన్‌లాండ్‌కు రష్యా హెచ్చరిక

రష్యాపై ఐరాసలో తీర్మానానికి భారత్‌ గైర్హాజరు

కీవ్‌/ఐక్యరాజ్యసమితి: రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మొదటినుంచీ ఆరోపిస్తున్న ఉక్రెయిన్, తొలిసారిగా ఆ అభియోగాల కింద రష్యా సైనికునిపై విచారణకు శుక్రవారం తెర తీసింది. చుపాకివ్‌కా గ్రామంలో 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపిన కేసులో అరెస్టయిన రష్యా జవాను సార్జెంట్‌ వాదిమ్‌ షైషిమారిన్‌(21)ను కీవ్‌లోని కోర్టుకు తరలించి విచారించారు. షైషిమారిన్‌ అంగీకరించాడని అధికారులు చెప్పారు. అతనికి యావజ్జీవ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

‘బాలల’ సంక్షోభమే: ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ముమ్మాటికీ బాలల హక్కుల సంక్షోభమేనని ‘యునిసెఫ్‌’ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒమర్‌ అబ్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, నాటో కూటమిలో చేరొద్దని ఫిన్‌లాండ్‌ను రష్యా హెచ్చరించింది. లేదంటే సైనిక, సాంకేతిక  చర్యలు తప్పవని హెచ్చరించింది.

భారత ఎంబసీ పునఃప్రారంభం
కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కార్యకలాపాలు ఈ నెల 17 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో మానవ హక్కుల పరిస్థితి నానాటికీ దిగజారుతుండడంపై ఐరాస మానవ హక్కుల మండలిలో చేసిన తీర్మానానికి భారత్‌ దూరంగా ఉంది.

రష్యా సైన్యానికి చేదు అనుభవం  
తూర్పు ఉక్రెయిన్‌లోని సివెర్‌స్కీ డొనెట్స్‌ నదిని దాటుతున్న రష్యా దళాలపై ఉక్రెయిన్‌ సైన్యం విరుచుకుపడినట్లు బ్రిటిష్‌ అధికారులు శుక్రవారం తెలిపారు. పదుల సంఖ్యలో రష్యా సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయని, జవాన్లు హతమయ్యారని వెల్లడించారు. ఆయుధాల కొనుగోలు కోసం ఉక్రెయిన్‌కు అదనంగా 520 మిలియన్‌ డాలర్ల సాయం అందించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. జి–7 దేశాల దౌత్యవేత్తలు జర్మనీలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై చర్చించారు.  

మరిన్ని వార్తలు