Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా

24 Mar, 2022 04:51 IST|Sakshi
కీవ్‌లో రష్యా వైమానిక దాడిలో ధ్వంసమైన భవనంలో మంటల్ని ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

రిలీఫ్‌ వాహనాలు, వర్కర్ల నిర్బంధం

కీవ్, మారియుపోల్‌పై నిప్పుల వర్షం

5 సెకన్లకు ఒక బాంబుతో విధ్వంసం

కీలకమైన కీవ్‌ బ్రిడ్జి పేల్చివేత

దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌

తాము సాధించిందేమీ లేదన్న రష్యా

కీవ్‌: నెల రోజుల యుద్ధంలో సాధించిందేమీ లేదన్న నిస్పృహతో రష్యా నానాటికీ మరింత హేయంగా ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్‌ దుయ్యబట్టింది. నిర్బంధంతో అల్లాడుతున్న మారియుపోల్‌ నగరానికి బుధవారం ఆహారం తదితర అత్యవసరాలను తీసుకెళ్తున్న హ్యుమానిటేరియన్‌ కాన్వాయ్‌ని, 15 మంది రెస్క్యూ వర్కర్లను రష్యా సైన్యం నిర్బంధించిందని ఆరోపించింది.

ఇరుపక్షాలూ అంగీకరించిన మానవీయ కారిడార్లను గౌరవించడం లేదంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దుమ్మెత్తిపోశారు. నగరంపై భూ, గగనతల దాడులకు తోడు నావికా దాడులకూ రష్యా తెర తీసింది. అజోవ్‌ సముద్రం నుంచి ఏడు యుద్ధ నౌకల ద్వారా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజులుగా ఐదు సెకన్లకో బాంబు చొప్పున పడుతున్నట్టు నగరం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు.

కీవ్‌లో ప్రతిఘటన
కీవ్‌పైనా రష్యా దాడుల తీవ్రత బుధవారం మరింత పెరిగింది. నగరం, శివార్లలో ఎటు చూసినా బాంబు, క్షిపణి దాడులు, నేలమట్టమైన నిర్మాణాలు, పొగ తప్ప మరేమీ కన్పించని పరిస్థితి. కానీ ఉక్రెయిన్‌ దళాల ప్రతిఘటన నేపథ్యంలో రష్యా సేనలు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోయాయని చెప్తున్నారు. ఉత్తరాది నగరం చెర్నిహివ్‌ను కీవ్‌కు కలిపే కీలక బ్రిడ్జిని రష్యా సైన్యం బాంబులతో పేల్చేసింది. దాంతో నగరానికి అత్యవసరాలను చేరేసే మార్గం మూసుకుపోయింది. తిండీ, నీరూ కూడా లేక నగరవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది.

ఉక్రెయిన్‌ గెరిల్లా యుద్ధం
ఉక్రెయిన్‌ సైన్యం దూకుడు మరింతగా పెరిగిందని పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ చెప్పారు. పలు నగరాల్లో రష్యా సైన్యాన్ని విజయవంతంగా నిలువరిస్తున్నట్టు చెప్పారు. వారి గెరిల్లా యుద్ధరీతులకు రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోందన్నారు. దక్షిణాదిన రష్యా ఆక్రమించిన ఖెర్సన్‌ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఉక్రెయిన్‌ను రోజుల వ్యవధిలోనే ఆక్రమించేస్తామన్న అతివిశ్వాసమే రష్యాను దెబ్బ తీసిందని పాశ్చాత్య సైనిక నిపుణులు అంటున్నారు.

‘‘పరాయి దేశంలో తీవ్ర ఆహార, ఇంధన కొరతతో రష్యా సైన్యం అల్లాడుతోంది. అతి శీతల వాతావరణం సమస్యను రెట్టింపు చేస్తోంది. మంచు దెబ్బ తదితర సమస్యలతో సైనికులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది చనిపోయారు’’ అని చెబుతున్నారు. మొత్తమ్మీద రష్యా తన యుద్ధపాటవంలో పదో వంతు దాకా కోల్పోయిందని అమెరికా అంచనా. ఆకలికి తాళలేక రష్యా సైనికులు దుకాణాలు, ఇళ్లను లూటీ చేస్తున్నారని ఉక్రెయిన్‌ చెబుతోంది.

చర్చల్లో పురోగతి
రష్యాతో చర్చల్లో కాస్త పురోగతి ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వెల్లడించారు. పలు కీలకాంశాలపై రెండువైపులా ఏకాభిప్రాయం దిశగా పరిస్థితులు సాగుతున్నాయన్నారు. పశ్చిమ దేశాలు మాత్రం రష్యా దిగొస్తున్న సూచనలేవీ ఇప్పటిదాకా కన్పించడం లేదంటున్నాయి.

జీ–20 నుంచి రష్యాకు ఉద్వాసన!
ఆంక్షలతో అతలాకుతలమవుతున్న రష్యాను ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల బృందమైన జీ–20 గ్రూప్‌ నుంచి తొలగించడంపై మిత్రపక్షాలతో అమెరికా చర్చలు జరుపుతోందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ తెలిపారు. ‘‘ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా అన్యాయమైన యుద్ధానికి దిగినందుకు పర్యవసానాలను రష్యా అనుభవించాల్సి ఉంటుంది. ఇకపై అది అంతర్జాతీయంగా ఏకాకిగానే మిగిలిపోతుంది’’ అన్నారు.

రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల మద్దతును మరింతగా కూడగట్టేందుకు నాలుగు రోజుల యూరప్‌ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం బయల్దేరారు. తొలుత బ్రెసెల్స్‌లో దేశాధినేతలతో ఆయన వరుస చర్చలు జరుపుతారు. నాటో అత్యవసర శిఖరాగ్ర భేటీలో, యూరోపియన్‌ యూనియన్, జీ–7 సమావేశాల్లో పాల్గొంటారు. శుక్రవారం పోలండ్‌ వెళ్లి మర్నాడు అధ్యక్షుడు ఆంద్రే డూడతో భేటీ అవుతారు.

మరిన్ని వార్తలు