పశ్చిమ దేశాలదే ఈ పాపం 

22 Feb, 2023 04:37 IST|Sakshi

ఉక్రెయిన్ పరిస్థితికి పూర్తిగా అవే కారణం  : పుతిన్ 

రష్యా ఉనికి కోసమే మా పోరాటం

ప్రపంచ భద్రత, శాంతి కోసం చర్చలకు సిద్ధం

మాస్కో: ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభం కావడానికి, ఇదింకా కొనసాగుతుండటానికి అవే బాధ్యత వహించాలన్నారు. తమను నిందించడం తగదన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పుతిన్‌ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ దేశాల ఆటలో రష్యా, ఉక్రెయిన్‌ బాధిత దేశాలుగా మారాయన్నారు. తాము ఉక్రెయిన్‌ ప్రజలపై పోరాడడం లేదని, కేవలం స్వీయ మనుగడ కోసమే పోరాటం సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. పుతిన్‌ ఇంకా ఏం చెప్పారంటే...

 అందుకే ఇలాంటి అడ్డదారులు  
‘‘పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్‌ బందీగా మారడం విచారకరం. రష్యా పతనమే వాటి లక్ష్యం. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ పోరుగా మార్చడమే వాటి ఉద్దేశం. రష్యా సరిహద్దు వరకూ విస్తరించాలని నాటో కూటమి ప్రయత్నించింది. రష్యా ఉనికిని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధం. మాపై యుద్ధం ప్రారంభించింది పశ్చిమ దేశాలే. దాన్ని ముగించడానికి మేం బలాన్ని ఉపయోగిస్తున్నాం. మాపై ‘సమాచార దాడులు’ కూడా జరుగుతున్నాయి.

రష్యా సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారు. యుద్ధక్షేత్రంలో రష్యాను ఓడించడం అసాధ్యమని వారికి తెలుసు కాబట్టి ఇలాంటి అడ్డదారులు ఎంచుకుంటున్నారు. మా ఆర్థిక వ్యవస్థపైనా దాడి చేస్తున్నారు. కానీ, వారిప్పటిదాకా సాధించింది ఏమీ లేదు. ఇకపైనా ఏమీ ఉండబోదు.’’


సైనికులకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు  
‘‘తూర్పు దేశాలను నాశనం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నాటో దళాల సంఖ్యను పెంచుతున్నారు. డాన్‌బాస్‌ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు మేము ప్రయత్నించాం. కానీ, పశ్చిమ దేశాలు క్రూరంగా వ్యవహరించాయి. ఉక్రెయిన్‌–రష్యా సమస్య పరిష్కారానికి అవి సిద్ధంగా లేవు. వాటి వైఖరి వల్లే వ్యవహారం మరింత జటిలంగా మారుతోంది.

రష్యాపై యుద్ధం కోసం ఆ దేశాలు ఉక్రెయిన్‌కు 150 బిలియన్‌ డాలర్లు అందజేశాయి. చివరకు ఉక్రెయిన్‌కు ఇరాక్, యుగోస్లావియా గతి పట్టించడం ఖాయం. ప్రపంచ భద్రత, శాంతి కోసం చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని పుతిన్‌ పునరుద్ఘాటించారు. రష్యా కోసం పోరాడుతున్న సైనికులకు, వారి కుటుంబాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.

‘న్యూ స్టార్ట్‌’లో రష్యా భాగస్వామ్యం రద్దు   
అమెరికాతో కుదిరిన ‘న్యూ స్టార్ట్‌ సంధి’లో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. అణ్వాయుధాల నియంత్రణ కోసం అమెరికా, రష్యా మధ్య కుదిరి, ఇంకా అమల్లో ఉన్న చివరి ఒప్పందం ఇదే కావడం గమనార్హం. ఒకవేళ అమెరికా అణ్వాయుధ పరీక్షలు చేపడితే తాము కూడా అందుకు సిద్ధమని పుతిన్‌ పేర్కొన్నారు.

అమెరికా, దాని నాటో మిత్రదేశాలు రష్యాను లక్ష్యంగా చేసుకున్నాయని, అందుకే న్యూ స్టార్ట్‌ సంధి నుంచి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగలేదని అన్నారు. తమను ఓడించి, తమ అణ్వాయుధాలను స్వా«దీనం చేసుకోవాలన్నదే పశ్చిమ దేశాల ఆలోచన అని మండిపడ్డారు. అమెరికా, రష్యా మధ్య న్యూ స్టార్ట్‌ సంధి 2010లో కుదిరింది. 2021 ఫిబ్రవరిలో ఈ సంధి గడువు ముగిసిపోగా, మరో ఐదేళ్లు పొడిగించారు.   

మరిన్ని వార్తలు