Russia Ukraine war: అమెరికా భారీ ‘సైనిక’ సాయం!

16 Jun, 2022 04:38 IST|Sakshi

ఉక్రెయిన్‌కు బిలియన్‌ డాలర్ల సాయం చేసే యోచనలో అగ్రరాజ్యం

వాషింగ్టన్‌: రష్యాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి భారీ స్థాయిలో సాయం అందనుంది. 1 బిలియన్‌ డాలర్ల విలువైన సైనిక సాయం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. శతఘ్నులు, మందుగుండు సామగ్రి, తీరప్రాంత రక్షణ వ్యవస్థలు ఇలా పలు విధాల సైనికఅవసరాలు అమెరికా తీర్చనుంది. మరోవైపు, నాటో కూటమి పంపిన ఆయుధాలు ఉంచిన ఆయుధాగారంపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది.

పశ్చిమ ఉక్రెయిన్‌లోని లివివ్‌ ప్రాంతంలోని ఆయుధాగారాన్ని నేలమట్టంచేశామని రష్యా తెలిపింది. కాగా, సివిరోడోనెట్సŠక్‌లో ఇరుదేశాల పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార బాధ్యతలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. బుధవారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. అయితే, ఉక్రెయిన్, రష్యాలకు చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందా లేదా అనేది జిన్‌పింగ్‌ చెప్పలేదు.

మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశంలో పర్యటిస్తానని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ చెప్పారు. కీవ్‌లో పర్యటించాల్సిన సమయం ఆసన్నమైందని రొమేనియాలో మీడియాతో అన్నారు. కాగా, రష్యాలో తమ వ్యాపారాన్ని తగ్గించుకుంటామని ఐకియా సంస్థ తెలిపింది. కాగా, యుద్ధం కారణంగా ఈ సీజన్‌లో 24 లక్షల హెక్టార్లలో పంటలు పండించబోమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.

మరిన్ని వార్తలు