Russia-Ukraine War: పుతిన్‌ను బోనెక్కించగలరా?

8 Apr, 2022 05:29 IST|Sakshi

యుద్ధ నేరాల కింద రష్యాపై విచారణ ముందుకెళుతుందా? 

బుచా మారణహోమంతో పెరుగుతున్న డిమాండ్లు

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విచక్షణారహితంగా సాగుతోంది. బుచా పట్టణంలో సాధారణ పౌరుల్ని వెంటాడి వేటాడిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా మిలటరీపైనా , అధ్యక్షుడు పుతిన్‌పైనా యుద్ధ నేరాల కింద విచారణ జరిపించాలని ప్రపంచ దేశాలు గర్జిస్తున్నాయి. యుద్ధం అంటేనే ఒక ఉన్మాద చర్య. అలాంటప్పు డు అందులో నేరాలుగా వేటిని పరిగణిస్తారు ? రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యుద్ధ నేరాల విచారణ సాధ్యపడుతుందా ? ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బుచా పట్టణం శవాల దిబ్బగా మారింది. రక్తమోడుతూ, మసిబొగ్గుల్లా మారిన 300 మంది అన్నెం పున్నెం ఎరుగని పౌరుల మారణహోమం వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో చిన్నారుల శరీరాలపై తల్లిదండ్రులు వారి వివరాలు రాయడం మనసుని పిండేస్తోంది. గత నెలలోనే మారియూపోల్‌లోని ప్రసూతి ఆస్పత్రి, థియేటర్లపై బాంబు దాడులతో రష్యా యుద్ధ నేరాలకు దిగింది. తాజాగా బుచా పట్టణంలో రష్యా మిలటరీ చేసిన మారణకాండతో ఆ దేశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం బోనులోకి ఎక్కించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అయితే రష్యా మాత్రం బుచాలో తాము జరిపింది మిలటరీ ఆపరేషనేనని ఉక్రెయిన్‌ చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఉక్రెయిన్‌ కవ్వింపు చర్యల్లో భాగమేనని ఎదురుదాడి చేస్తోంది.  
 

యుద్ధ నేరాలు అంటే ..?  
ఆయుధ బలం ఉంది కదాని ఒక దేశం ఇష్టారాజ్యంగా మరో దేశాన్ని నాశనం చేస్తామంటే కుదరదు. బలవంతుడి చేతిలో బలహీనులు బలికాకుండా ఉండడం కోసం 19వ శతాబ్ది ప్రారంభంలోనే అంతర్జాతీయ మానవతా చట్టం ద్వారా కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధ నేరాలపై ప్రపంచ దేశాలు విస్తృతంగా చర్చించి ఒక అవగాహనకి వచ్చాయి. 1949 ఆగస్టు 12న జరిగిన జెనీవా ఒప్పందం యుద్ధ నేరాల గురించి స్పష్టతనిచ్చింది. వివిధ ఒడంబడికల ఆధారంగా యుద్ధ నేరాలుగా వేటిని పరిగణించాలో యూఎన్‌ సభ్యదేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం యుద్ధ నేరాలంటే..

► యుద్ధంలో పాల్గొనని పౌరుల్ని ఉద్దేశపూర్వకంగా చంపడం  
► సాధారణ పౌరుల్ని హింసించడం, గాయపరచడం, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించడం
► ఆసుపత్రులు, స్కూళ్లు, ప్రార్థనాలయాలపై దాడులు జరపడం
► పౌరుల్ని బందీలుగా పట్టుకోవడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం. యుద్ధప్రభావం పౌరులపై పడేలా ధ్వంసం సృష్టించడం
► కొన్ని రకాల మారణాయుధాలు, రసాయన బాంబుల్ని వాడడం

ఇవన్నీ యుద్ధ నేరాలుగానే పరిగణిస్తారు. యుద్ధ నేరాలకు సంబంధించి జెనీవా ఒప్పందంలో ఉన్నవన్నీ తమకు సమ్మతమేనని 1954లోనే నాటి సోవియట్‌ యూనియన్‌ (యూఎస్‌ఎస్‌ఆర్‌) అంగీకరించింది. 2019లో కూడా రష్యా ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామనే స్పష్టతనిచ్చింది.  

యుద్ధనేరాల కేసు ముందుకెళుతుందా ?  
రష్యా మిలటరీ లేదంటే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై యుద్ధ నేరాల కేసుని ముందుకు తీసుకువెళ్లడం అంత సులభం కాదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో నేరారోపణల్ని నమోదు చేయడానికే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. ఉక్రెయిన్‌ నుంచి యుద్ధ నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించడం అంత సులభంగా జరిగే అవకాశం లేదని హార్వార్డ్‌ లా స్కూల్‌ ప్రొఫెసర్‌ అలెక్స్‌ వైటింగ్‌ అభిప్రాయపడ్డారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోలు, వీడియోలు వంటి ఆధారాలు సేకరించినప్పటికీ ఆ మారణకాండకి ఆదేశాలు ఇచ్చిన నాయకులెవరని రుజువు చేయడం సులభం కాదన్నారు.

అందుకే నేరారోపణలు నమోదైన తర్వాత కూడా విచారణకు ఏళ్లకి ఏళ్లు పట్టే అవకాశం ఉంది. నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌ కేంద్రంగా పనిచేసే స్వతంత్ర సంస్థ ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) యుద్ధనేరాలు, మారణకాండలు, ఊచకోతలపై విచారణ జరుపుతూ ఉంటుంది. ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ గత నెలలోనే రష్యా యుద్ధనేరాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఐసీసీలో 123 దేశాలకు సభ్యత్వం ఉన్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్‌ సభ్య దేశాలు కాదు.  రష్యా ఐసీసీని కనీసం గుర్తించలేదు సరికదా ఆ కోర్టు విచారణకు సహకరించకూడదని నిర్ణయం తీసుకుంది.  ఐసీసీ ఏర్పాటైన దగ్గర్నుంచి యుద్ధ నేరాలకు సంబంధించి 30 కేసుల్ని విచారించింది.     

– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు