Russia-Ukraine war: ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు?

8 Jul, 2022 04:53 IST|Sakshi

అవలోకనం

రణరంగం కానిచోటు భూ స్థలమంతా వెదకిన దొరకదు;

గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో
  – శ్రీశ్రీ

ప్రస్తుతం ఉక్రెయిన్‌ పరిస్థితీ ఇదే! దేశంలో రక్తపుటేరులు పారుతున్నాయి. అమాయక పౌరులు శవాల గుట్టలుగా మారుతున్నారు. విధ్వంసం తాండవిస్తుంటే తలదాచుకునే నీడ కరువై దేశం వీడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. రష్యా విసిరిన పంజాకు ఉక్రెయిన్‌ తల్లడిల్లుతుంటే, ప్రత్యక్షంగా ఈ యుద్ధ ప్రభావానికి లోనుకాని వాళ్లకు ఈ దృశ్యాలన్నీ చరిత్ర చెక్కుతున్న రుధిర చిత్రాలే!

ఈ ఏడాది ఫిబ్రవరి 24న వ్లాదిమిర్‌ పుతిన్‌ తన పొరుగు దేశమైన ఉక్రెయిన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దండయాత్రను ప్రకటించినప్పుడు ప్రపంచం యావత్తూ షాక్‌కు గురైంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ దురాక్రమణను తాము ముందే ఊహించినట్టు చెప్పుకొచ్చారు. నెలలు గడుస్తున్నా రోజూ తెల్లారుతున్న మాదిరిగానే యుద్ధమూ కొనసాగుతూనే ఉంది. చాలామంది యుద్ధం వార్తలు చదవడం ఆపేశారు కూడా.

మొదట్లో పతాక శీర్షికలకెక్కిన యుద్ధ వార్తలు ఇప్పుడు అట్టడుగుకు చేరుకున్నాయి. ప్రసార మాధ్యమాల్లో సైతం యుద్ధ వార్తలపై ఇదే ధోరణి. వీటితో నిమిత్తం లేకుండా కదనరంగంలో మాత్రం విధ్వంసం కొనసాగుతూనే ఉంది. రోజుకెందరు ప్రాణాలు విడుస్తున్నారో, ఇంకెందరు నిరాశ్రయులవుతున్నారో లెక్క లేదు. ఈ విధ్వంసం, మానవ హననం ఏ స్థాయికి వెళ్తాయో ఊహించలేము. మరోవైపు యుద్ధానికి అంతమెప్పుడన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమోనని నెటిజన్లంతా ఇంటర్నెట్‌ను శోధిస్తున్నారు. సూటిగా చెప్పాలంటే యుద్ధం కేలండర్‌ను గానీ, మారుతున్న తేదీలను గానీ పట్టించుకోదు.

ఒకరకంగా యుద్ధానికి కేలండర్‌పై చిన్నచూపనే అనుకోవాలి. గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన సిసిలీ ద్వీపానికి, నెదర్లాండ్స్‌కు ఓ వివాదం ఏకంగా 335 ఏళ్లు కొనసాగింది. ఒక రకంగా ఇదో రక్తపాత రహిత యుద్ధం. ఒక్క బులెట్‌ ఫైర్‌ కాలేదు. ఒక్క మరణమూ చోటుచేసుకోలేదు. దేనికోసమైతే యుద్ధం మొదలైందో ఆ సమస్యకు కదనరంగంలో జవాబు దొరికినప్పుడే ఏ యుద్ధమైనా ముగుస్తుంది. లేదా వైరిపక్షాల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడినప్పుడు ముగుస్తుంది.

యుద్ధానికి ప్రేరేపించిన లక్ష్యాలు నెరవేరినప్పుడూ, లేదా నెరవేరడం అసాధ్యమని తేలినప్పుడు కూడా యుద్ధం ముగుస్తుంది. ఇలాంటి ముగింపులు అఫ్గానిస్తాన్, సిరియా, లిబియా విషయాల్లో కనిపించాయి కూడా. ఈ నేపథ్యంలో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా ఎందుకు ముగియడం లేదన్నది నెటిజన్లు ఎక్కువగా వెదికిన అంశం కావడం ఆసక్తికరం.

పుతిన్‌ అసలెందుకు ఉక్రెయిన్‌పై దాడికి దిగినట్టు? దాన్ని ఆక్రమించే సత్తా తనకుందని గట్టిగా నమ్మే దండయాత్ర ఆరంభించాడు. ఉక్రెయిన్‌కు నాటో ఆయుధాలు అందించగలదే గానీ దానికి మద్దతుగా కదనరంగంలో కాలుపెట్టదనీ విశ్వసించాడు. అమెరికా ప్రతిచర్య మాటలకే పరిమితమవుతుందని కూడా ముందే ఊహించాడు.

రెండు శతాబ్దాలు రష్యాలో భాగంగానే ఉన్న ఉక్రెయిన్‌ నాటోకు వ్యతిరేకంగా తనతో చేయి కలపాలని పుతిన్‌ ఆశించాడు. మాట విననందుకు దాన్ని మిలిటరీరహిత దేశంగా చూడాలని పంతం పట్టాడు. పుతిన్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాటలయుద్ధం కదనరంగానికి దారితీసి సామాన్యుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. ఇద్దరూ ‘తగ్గేదే లే’ అంటూ కలబడుతున్నారు.

యుద్ధం వల్ల వాణిజ్యం తీవ్రంగా దెబ్బ తినడంతో రష్యా, ఉక్రెయిన్‌ నుంచి క్రూడాయిల్, గోధుమల ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్రూడ్, గోధుమలకు వాటిపై ఆధారపడ్డ దేశాలన్నీ తీవ్ర కొరతతో అల్లాడుతున్నాయి. కనీసం కొంతకాలంపాటు కాల్పుల విరమణ ప్రకటించినా వెసులుబాటుగా ఉండేదంటున్నాయి. కానీ ఇప్పట్లో ఆ అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. రష్యాకు లొంగిపోయి పుతిన్‌ కనుసన్నల్లో బతకడానికి జెలెన్‌స్కీ ససేమిరా అంటున్నారు. మరోవైపు పుతిన్‌ది విచిత్రమైన పరిస్థితి. పైకి బలంగా కనిపించినా భారీగా బలగాలను కోల్పోయిన రష్యా, ఇప్పుడు యుద్ధం ఆపడమంటే వెనకడుగు వేసినట్టేననే భావనలో ఉంది. మరి యుద్ధం ఆగేదెట్లా? ఇప్పటికిది సమాధానం లేని ప్రశ్నే.  

– సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి
 

మరిన్ని వార్తలు