Russia Ukraine War: ఉక్రెయిన్‌ చీకట్లో వెలుగు రేఖ! ఈ పసికందును చూసైనా పుతిన్‌ మనసు కరిగేనా?

26 Feb, 2022 21:38 IST|Sakshi

Ukraine Hope In Darkness New Baby Photos Viral: యుద్ధ మేఘాలు అలుముకోవడంతో చీకట్లు కమ్మేశాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఉ‍క్రెయిన్‌ పౌరులు. అంతలో పురిటి నొప్పులతో దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది ఆ తల్లి. ఆ క్షణం ఈ లోకంలోకి వచ్చిన బిడ్డ ఏడ్పు.. అక్కడున్న వారి పెదాలపై చిరునవ్వు పూయించింది. ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడానికి కొన్ని క్షణాల ముందు వైరల్‌ అయిన ఆ ఫొటోల్ని.. సోషల్‌ మీడియా భావోద్వేగంగా భావిస్తోంది. ఆ బిడ్డే తమ ఆశాకిరణంగా, యుద్ధ చీకట్లు పారదోలే వెలుగు రేఖగా భావిస్తోంది యావత్‌ ఉక్రెయిన్‌.   

రష్యా మిలిటరీ చర్యతో భీకర యుద్ధం ఉక్రెయిన్‌ను వణికిస్తోంది. రష్యా సైన్యం రక్తదాహానికి బలవుతున్న ఉక్రెయిన్‌ పౌరుల సంఖ్య పెరిగిపోతోంది. నివాస ప్రాంతాల్లో సైతం రష్యా బలగాలు దాడులకు పాల్పడుతుండడంతో.. ప్రాణభీతితో బంకర్లలో, మెట్రో స్టేషన్‌ అండర్‌ గ్రౌండ్‌లలో బాంబుల మోతకు దొరక్కుండా  తలదాచుకుంటున్నారు పౌరులు. రాజధాని కీవ్‌లో మెట్రోతో పాటు బాంబ్ షెల్టర్‌, మరో 4500 షెల్టర్‌ హోమ్స్ ఉన్నాయి. అక్కడే వేల మంది తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో జరిగిన ఓ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

రాజధాని కీవ్‌లో అండర్‌ గ్రౌండ్‌లో దాక్కొన్న ఓ గర్భిణికి శుక్రవారం రాత్రి సమయంలో హఠాత్తుగా నొప్పులు వచ్చాయి. దీంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు ఆమెకు సాయపడ్డారు. బయట బాంబుల మోత మోగుతున్నా.. రెండు నిండు ప్రాణాలు కాపాడేందుకు తొణకకుండా వైద్యం అందించారు. చివరకు ఆ తల్లి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి, తల్లి, ఆ కుటుంబం క్షేమంగా ఉన్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. కనీసం ఈ బిడ్డలాంటి వాళ్లను చూసైనా పుతిన్‌ మనసు కరగాలని ప్రార్థిస్తున్నారు నెటిజన్లు.

మరోవైపు నిప్రోలో ర‌ష్యా బాంబుల ధాటికి బెదరకుండా.. వైద్య సిబ్బంది 12 మంది నవజాత శిశువులను అండర్‌ గ్రౌండ్‌కు తరలించి.. ప్రాణాలు నిలిపారు. ఎంతో మంది గర్భిణిలు ఇబ్బందులు పడకుండా వైద్య సేవలు అందిస్తోంది సిబ్బంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం వైరల్‌ అవుతున్నాయి. ఇక ఇప్ప‌టికే ల‌క్ష మంది ఉక్రెయిన్‌ పౌరులు యుద్ధ వాతావరణంలో చెల్లాచెదుర‌య్యారు. గురువారం ఒక్క రోజే సుమారు 35వేల మంది పోలాండ్‌లోకి ప్ర‌వేశించినట్లు తెలుస్తోంది. సుమారు 50 ల‌క్ష‌ల మంది ఉక్రెనియ‌న్లు విదేశాల‌కు త‌ర‌లివెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇప్పటికే ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేసింది.

నిప్రో నర్సు పర్యవేక్షణలో పసికందులు

మరిన్ని వార్తలు