Russia-Ukraine war: ఆగని కన్నీటి వరద

9 Jun, 2023 05:20 IST|Sakshi
నీటిలో మునిగిన నిప్రియనీ గ్రామం

ఉక్రెయిన్‌లో వేలాది గృహాలను ముంచేసిన డ్యామ్‌ నీరు

ప్రభావిత ప్రాంతాల్లో జెలెన్‌స్కీ పర్యటన

కొట్టుకుపోయిన మందుపాతరలు

జనాల్లో ఎక్కడకు పోయాయో, ఎప్పుడు పేలుతాయోనన్న భయం

ఖేర్సన్‌(ఉక్రెయిన్‌): నీపర్‌ నదిపై కఖోవ్కా డ్యామ్‌ పేలుడుతో కొత్త మలుపు తీసుకున్న ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతో జనం కష్టాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లూ బాంబుల మోతతో బంకర్లతో, భూగర్భ గృహాల్లో తలదాచుకున్న జనం ఇప్పుడు అవన్నీ జలమయం కావడంతో పొట్టచేతపట్టుకుని ప్రాణభయంతో పరుగుపెడుతున్నారు. యుద్ధంలో శత్రుదేశ సైన్యం సంహారం కోసం జనావాసాలకు దూరంగా పూడ్చిపెట్టిన మందుపాతరలు వరదప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి.

ఆ వరదనీరు జనావాసాలను ముంచెత్తడంతో అవి ఇప్పుడు జనావాసాల్లో ఎక్కడికి కొట్టుకొచ్చి ఆగాయో, ఎప్పుడు పేలుతాయోనన్న భయం జనాలను వెంటాడుతోంది. నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్‌ అధీనంలో ఉంది. తమ అధీన నగర ప్రాంతంలో ఐదుగురు చనిపోయారని రష్యా నియమిత మేయర్‌ వ్లాదిమిర్‌ గురువారం చెప్పారు. మరికొందరి జాడ గల్లంతైంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది.  తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు.

నష్టపరిహారం ఇవ్వండి: జెలెన్‌స్కీ
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పర్యటించి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ‘రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతవాసులకు వరద నష్టపరిహారం చెల్లించాలి. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందించాలి’ అని తర్వాత ఆయన కార్యాలయం ఆన్‌లైన్‌లో ఒక డిమాండ్‌ పంపింది. ‘600 చదరపు కిలోమీటర్ల భూభాగం నీటమునిగింది. ఇక్కడ ఏకంగా 18 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. 14,000కుపైగా భవనాలు నీటమునిగాయి. 4,000కుపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపాం’ అని రష్యా నియమిత ఆ ప్రాంత గవర్నర్‌ ఒలెక్సాండర్‌ ప్రొకుడిన్‌ చెప్పారు. నీపర్‌ నది తూర్పు పరివాహక ప్రాంతంలో మూడింట రెండొంతుల భూభాగం ర్రష్యా ఆక్రమణలో ఉంది.  

ఇది విధ్వంసకర దాడే: మేక్రాన్‌
‘డ్యామ్‌ను కూల్చేయడం ముమ్మాటికీ విధ్వంసకర దాడే. అరాచక చర్య ఇది’ అని ఏ దేశాన్నీ ప్రస్తావించకుండా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ట్వీట్‌చేశారు. వాటర్‌ ప్యూరిఫయర్‌లు, 5,00,000 ప్యూరిఫికేషన్‌ టాబ్లెట్లు, శుభ్రతా కిట్‌లు పంపిస్తున్నట్లు ఫ్రాన్స్‌ తెలిపింది. ‘డ్యామ్‌ కూలడానికి మూడు రోజుల ముందు 200 సైనిక వాహనాలు, 2,000 మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్‌ ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు డ్యామ్‌ను ఉక్రెయినే కూల్చింది’ అని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఆరోపించారు.

మరిన్ని వార్తలు