రష్యాకు మరో షాక్‌! నాటోలో చేరనున్న మరోదేశం

17 May, 2022 05:44 IST|Sakshi

స్టాక్‌హోమ్‌: నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్‌ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్‌ ప్రధాని మగ్డలీనా అండర్సన్‌ సోమవారం ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను        తటస్థ వైఖరికి స్వీడన్‌ ముగింపు పలుకుతోంది.      ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్డలీనా అభివర్ణించారు. నాటో      సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు    అవసరమన్నారు.

నాటోలో చేరికపై ఫిన్లాండ్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయానికి స్వీడన్‌ పార్లమెంట్‌ రిక్స్‌డగెన్‌లో భారీ మద్దతు లభించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. రెండు దేశాల్లో కూడా నాటో చేరికపై ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వీడన్‌ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. నాటోలో చేరినా తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో శాశ్వత బేస్‌లను అంగీకరించబోమని మగ్డలీనా చెప్పారు.

డొనెట్స్‌క్‌పై దాడులు ఉధృతం
తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్‌క్‌పై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. మారియుపోల్‌లోని స్టీల్‌ ప్లాంట్‌ చుట్టూ వైమానిక దాడులు కొనసాగాయి. పలు పట్టణాలలోని పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఖర్కివ్‌ చుట్టూ రష్యన్‌ దళాలు తమను నిరోధించే యత్నాల్లో ఉన్నాయని ఉక్రెయిన్‌ తెలిపింది. అయితే సరిహద్దులో బెలరాస్‌ బలగాలున్నందున ఉక్రెయిన్‌ సేనలు ఉన్నచోటే ఉండి పోరాడడం మేలని బ్రిటీష్‌ సైన్యం సూచించింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఒక ఆస్పత్రిపై జరిపిన దాడిలో ఇద్దరు మరణించారని ఉక్రెయిన్‌ ఆరోపించింది.

రష్యాలో వ్యాపారాల అమ్మకం
పలు పాశ్చాత్య కంపెనీలు రష్యాలోని తమ వ్యాపారాలను తెగనమ్ముకుంటున్నాయి. రష్యాలో వ్యాపార విక్రయ ప్రక్రియను ఆరంభించామని మెక్‌డొనాల్డ్స్‌ తెలిపింది. సంస్థకు రష్యాలో 850 రెస్టారెంట్లున్నాయి. వాటిలో 62 వేల మంది పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సంస్థ లాభాలపై ప్రభావం పడే అవకాశముందని తెలిపింది. ఇదే బాటలో కార్ల తయారీ సంస్థ రెనో సైతం       రష్యాలో తమ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థకు స్థానిక అవటోవాజ్‌ కంపెనీలో ఉన్న 67.69 శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇదే కోవలో పలు పాశ్చాత్య కంపెనీలు పయనించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

(చదవండి: పుతిన్‌ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?)

మరిన్ని వార్తలు