Russia Warns Sweden And Finland: ఆ దేశాలకు రష్యా న్యూక్లియర్‌ వార్నింగ్‌

15 Apr, 2022 08:30 IST|Sakshi

మాస్కో: నాటో కూటమిలో చేరాలని స్వీడన్, ఫిన్లాండ్‌ నిర్ణయించుకుంటే తమ అణ్వాయుధాలను స్కాండినేవియన్‌ దేశాలకు సమీపంగా మోహరించాల్సిఉంటుందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెద్వదేవ్‌ హెచ్చరించారు. ఈ దేశాలు నాటోలో చేరితే రష్యాకు నాటో సభ్యదేశాలతో ఉన్న సరిహద్దు రెట్టింపవుతుందని, అలాంటప్పుడు తాము సరిహద్దు భద్రతను పెంచుకోవాల్సిఉంటుందని టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ దేశాలు నాటో కూటమిలో చేరితే బాల్టిక్‌ పరిధిలో నాన్‌ న్యూక్లియర్‌ స్థితి ఉండదనానరు. గల్ఫ్‌ ఆఫ్‌ ఫిన్లాండ్‌లోకి యుద్ధ నౌకలు కూడా పంపాల్సివస్తుందన్నారు.

డిమిట్రీ వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రతినిధి పెస్కోవ్‌ సమర్ధించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం ఎలాంటి మిలటరీ కూటమిలో చేరకూడదన్న స్కాండినేవియన్‌ దేశాల ధృక్పథంలో మార్పు వస్తోంది. నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేయడంపై చర్చిస్తామని ఫిన్లాండ్, స్వీడన్‌ తెలిపాయి. మరోవైపు జపాన్‌ సముద్రంలో రష్యా మిసైల్‌పరీక్షలు నిర్వహించడాన్ని గమనిస్తున్నామని జపాన్‌ తెలిపింది. సీ ఆఫ్‌ జపాన్‌లో అమెరికా, జపాన్‌ సంయుక్త విన్యాసాలు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజు రష్యా జలాంతర్గాముల ద్వారా మిసైల్‌ పరీక్షలు నిర్వహించింది.

చదవండి: (రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం)

అమెరికాపై ఒత్తిడి 
రష్యాకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఉక్రెయిన్‌కు మరింత అందజేయాలని అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. రష్యాపై యూఎస్‌ సేకరించిన సమాచారం ఒక్కోమారు ఉక్రెయిన్‌కు అందజేస్తుండగా, కొన్నిమార్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. రష్యాతో అణుయుద్ధ ప్రమాదం పెరగకుండా ఉండేలా, ఇంటిలిజెన్స్‌ సోర్సులను రక్షించేలా సమాచారం అందించాల్సిఉంటుందని యూఎస్‌ వర్గాలు తెలిపాయి. గతంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేటప్పుడు అమెరికాకు ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. గతంలో పోగొట్టుకున్న భూభాగాన్ని ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకునే యత్నం చేస్తుందన్న అనుమానం వచ్చినప్పుడు సమాచారాన్ని పరిమితం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు