ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్‌కు షాకిచ్చిన వ్యాపారవేత్త!

4 Mar, 2023 12:56 IST|Sakshi

మాస్కో: రష్యా ఖజానా ఏడాదిలోగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు ఆ దేశానికి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త ఒలెగ్ డెరిపాక్స. సిబేరియాలో గురువారం జరిగిన ఆర్థిక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు గతేడాది కఠిన ఆంక్షలు విధించినా రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించిన తర్వాత ఒలెగ్ అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.

ఉక్రయిన్‌తో యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల  రష్యా ప్రభుత్వ ఖజనా ఖాళీ అవుతోందని, ఏడాదిలోగా ఏమీ మిగలని పరిస్థితి వస్తుందని ఒలెగ్ పేర్కొన్నారు. విదెశీ పెట్టుబడిదారుల అవసరం ఇప్పుడు రష్యాకు అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే దీన్ని ఆపేయాలని ఒలెగ్ బహిరంగంగా ప్రకటించారు.

పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు ఇప్పుడు మిత్రదేశాలు ఆపన్నహస్తం అందించి కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఒలెగ్ అభిప్రాయపడ్డారు.అయితే విదేశీ ఇన్వెస్టర్లకు రష్యా అనువైన పరిస్థితులు కల్పించి మార్కెట్లను ఆకర్షణీయంగా చేస్తేనే పెట్టుబడిదారులు ముందుక వస్తారని వివరించారు.

ఉక్రెయిన్‌పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమ దేశాలు ఆ దేశంపై 11,300కు పైగా ఆంక్షలు విధించాయి. 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను ఫ్రీజ్ చేశాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని హెచ్చరించాయి. కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా ఏడాదిగా దండయాత్ర కొనసాగిస్తోంది.

ఒక్క చైనా మాత్రమే రష్యాకు బాసటగా నిలిచింది. ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేసింది. మెషీనరీ, బేస్ మెటల్స్‌ వంటి ఉత్పత్తులు సరఫారా చేసి పశ్చాత్య దేశాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అది ఏమాత్రము రష్యా కోలుకునేందుకు సాయపడలేదు.
చదవండి: ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం

మరిన్ని వార్తలు